KTR Participated BRS Formation Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఎవరెంత కించపర్చినప్పటికీ తాము కుంగిపోబోమని, అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎక్కడ ఉన్నా ప్రజల గొంతుకగానే బీఆర్ఎస్ పని చేస్తుందని కేటీఆర్ అన్నారు.
BRS Formation Day 2024 : తెలంగాణకంటూ ఒక గొంతు ఉండటం అవసరమని కేటీఆర్ అన్నారు. 24 ఏళ్ల స్ఫూర్తితో కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతామని తెలిపారు. 24 సంవత్సరాల్లో తమకు ఇచ్చిన గౌరవం, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు వదిలిన వందలాది మంది స్ఫూర్తితో, తాము ముందుకు పోతామని పేర్కొన్నారు. పార్టీని ఆదరించిన రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు.
కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే స్వరాష్ట్రం సహకారం అయిందని, పార్టీ తరపున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని కేటీఆర్ చెప్పారు.
అందుకే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ : తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో బీఆర్ఎస్‌గా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని కేటీఆర్ వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రంలో అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని తెలిపారు. కేసీఆర్ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసని కేటీఆర్ గుర్తు చేశారు.
తాము విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటామని, కొట్లాడుతూనే ఉంటామని తెలిపారు. కొన్నిసార్లు కింద పడుతుంటాం, పైకి లేస్తుంటామని, బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల గొంతుకగానే ఉంటుందని అన్నారు. తెలంగాణకు ఉన్న ఒక ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని వివరించారు. కేసీఆర్‌ను తెలంగాణ కోరుకుంటోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.