KTR Tweet On Pension Recovery : కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలిక ఊడినట్లుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్తగూడెం జిల్లాలో ఓ వృద్ధురాలు పింఛన్ కింద వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న నోటీసులపై ఆయన ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలు పెట్టిందని ఆక్షేపించారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ, వేలాది మంది ఆసరా పింఛన్ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
KTR Comments On Congress : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పింఛన్ కింద వచ్చిన రూ.1.72 లక్షలను వెనక్కి కట్టాలని నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పింఛన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు.
కొండ నాలుకకు మందేస్తే
— KTR (@KTRBRS) July 13, 2024
ఉన్న నాలిక ఊడినట్టుంది!
కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది.
ఏవో సాంకేతిక… pic.twitter.com/tQadMKcvuz
పెన్షన్ తిరిగి ఇవ్వాలని నోటీసులు : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద వృద్ధుల పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇంకా ఆ హామీ అమలు కాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పలుమార్లు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, వృద్ధుల పింఛన్ పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి, ఓ వృద్ధురాలి నుంచి ఉన్న పింఛన్ తిరిగి చెల్లించాలన్న నోటీసులపై సర్వత్రా చర్చ నడుస్తోంది.