KTR On Electricity bill : విద్యుత్ అనేది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కలిసినట్లు చెప్పారు. 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్‌కు రూ.10 ఫిక్స్‌డ్ ఛార్జీ వసూలు చేస్తున్నారని, ఆ పరిధి దాటితే ప్రస్తుతం ఉన్నదానికంటే 5 రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.
కేసీఆర్ పదేళ్లలో ప్రజలపై భారం వేయకుండా ట్రూ అప్ చార్జీల కోసం నెలకు వెయ్యి కోట్లు ప్రభుత్వమే భరించిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ను వ్యాపార వస్తువుగా చూస్తోంది, ఇది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు అవుతుందన్నారు.
గ్రూప్ వన్ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు : అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ వన్ పై సుప్రీంకోర్టులో కేసు వేసింది తామేనని హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టును ఆదేశించిందన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగానికి అనుగుణంగా కేసీఆర్ జీఓ 55 తీసుకొచ్చారని ప్రభుత్వ మూర్ఖపు వైఖరితో గ్రూప్ వన్ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. జీఓ 29 ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులా మారిందని విమర్శించారు.
తెలంగాణేతర వాసుల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. వీటి గురించి మంచి న్యాయవాదిని పెట్టి హైకోర్టులో పోరాడతామని తెలిపారు .ప్రభుత్వానికి భేషజాలు, ఈగో ఉండరాదన్నారు. లక్షన్నర కోట్లు మూసీ కోసమని రాష్ట్ర ప్రభుత్వం గ్రోత్ స్టోరీలో పెట్టిందని మూసీ పేరిట దోచుకునే వైనాన్ని ప్రశ్నించవద్దా అని మండిపడ్డారు. దామగుండం, భువనగిరిలో మూసీని చంపుతూ మధ్యలో రంగులు వేసి దోచుకుంటామంటే ప్రధాన ప్రతిపక్షంగా ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని బీఆర్ఎస్ హయాంలో ఒక్క సంఘటన జరగలేదని గుర్తుకుతెచ్చారు. ముత్యాలమ్మ గుడిపై దాడిని ఎక్స్‌లో ఖండిస్తే తెలంగాణ పోలీసులు ఆ పోస్టు తొలగించాలని వారికి లేఖ రాశాన్నారు.
‘‘పరిశ్రమలన్నింటికీ ఒకే విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే అసంబద్ధ విధానాల వల్ల పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. అర్ధరహిత ఆలోచనల వల్ల పారిశ్రామిక రంగం మరింత దెబ్బతింటుంది. గతంలో ట్రూఅప్ ఛార్జీలు రూ.12,500 కోట్లు పెంచాలని విద్యుత్ సంస్థలు కోరాయి. ఆ భారాన్ని గతంలో ప్రభుత్వమే భరించింది. ప్రజలపై వేయలేదు’’ -కేటీఆర్,బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
దిల్లీకి మూటలు పంపేందుకు మూసీపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు : కేటీఆర్
' రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు మేం అడ్డంగా నిలబడతాం - హైదరాబాద్‌లో పేదలకు అండగా ఉంటాం'