KTR Support To Hydra Demolition Victims : మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కిషన్ బాగ్, బహదూర్ పురా ప్రాంతాలకు చెందిన పలువురు హైడ్రా, మూసీ బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. అన్ని అనుమతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని వాపోయారు. కేసీఆర్ హయాంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను ఆదుకుంటుందనుకుంటే ఇళ్లను కూలగొడుతుండటం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. వారి బాధలు విన్న ఆయన భరోసా ఇచ్చారు.
పేదల ఇళ్లు ఒక్కటి కూడా కూల్చనివ్వబోమన్న కేటీఆర్, బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షంగా ఓ వైపు పోరాటం చేస్తూనే పేద ప్రజల తరపున న్యాయపరంగా కూడా పోరాడతామని చెప్పారు. హైడ్రా, మూసీ బాధితులకు లీగల్‌గా సాయం చేసేందుకు తెలంగాణ భవన్లో లాయర్ల బృందం ఉంటుందని తెలిపారు. అన్ని పర్మిషన్లు ఇచ్చి, పన్నుల వసూలు చేసి ఇప్పుడు వాళ్ల ఇళ్లు కూల్చటమనేది దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఇల్లు అనేది ప్రజలకు ఉద్వేగంతో కూడిన అనుబంధం అని కేటీఆర్ తెలిపారు. అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ప్రభుత్వమే గుర్తించిన ఇళ్లను ఎందుకు కూల్చుతున్నారని గట్టిగా అడిగారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
"మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హైడ్రా బాధితులకు లీగల్‌గా సాయం చేసేందుకు తెలంగాణ భవన్లో లాయర్ల బృందం ఉంటుంది. మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో త్వరలో బయటపెడతా''-కేటీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు
కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కార్యాలయాన్నే కూల్చాలి : కేటీఆర్ - KTR Fires on Hydra