KTR Comments On Hyderabad Sanitation Maintenance : హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన స్వచ్ఛ ఆటోలను మూలన పడేసినట్లు ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని తెలిపారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. నగర మేయర్, పురపాలక శాఖ అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుద్ధ్యం నిర్వహణ గాడి తప్పుతోందని విమర్శించారు. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ శాఖ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, దిల్లీ చక్కర్లలో చాలా బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, హైదరాబాద్ మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ VS కేటీఆర్ - అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం - telangana assembly meetings 2024