KRMB Orders On Release Of Sagar Water : వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 వ తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి వినియోగానికి అవకాశం ఉంది.
Water Allocations For Telangana : అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నర టీఎంసీలు కేటాయించారు. మిగిలిన నీరు హైదారాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతి ఇచ్చారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే నీటిని వినియోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. హైదరాబాద్ జనాభాను పరిగణలోకి తీసుకొని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. దీంతో నాగార్జునసాగర్‌లో 500 అడుగులపై ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
అక్టోబర్‌లో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై ఈ నెల 12 వ తేదీన చర్చ జరిగింది. వాస్తవానికి ఈ నెల నాలుగో తేదీన కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కానందున వాయిదా వేశారు. కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు.
మరోవైపు తెలంగాణలో జలాశయాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు పెద్దగా లేకపోవడంతో జలాశయాలు అడుగుంటుతున్నాయి. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా, కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ అందడం లేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
'ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు' - కేంద్ర జల్‌శక్తి శాఖకు చేరిన అసెంబ్లీ తీర్మానం