KRMB and GRMB on Funds from Telugu States : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన నదీ యాజమాన్య బోర్డులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులకు చెందిన అంశాలు, వివాదాలు, కేటాయింపులు, నిర్వహణకు రెండువేర్వేరు బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయా బోర్డులు నడుస్తున్నాయి. ఛైర్మన్, కొంత మంది సభ్యులను కేంద్రమే నియమిస్తుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు ఉద్యోగులు, సిబ్బందితోపాటు నిధులు సమకూర్చాలి. ఆ మేరకు 2014 నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
నదీ యాజమాన్య బోర్డులకు రెండు రాష్ట్రాల నుంచి ఎప్పుడూ సకాలంలో సరిపడా నిధులు రాలేదని చెబుతున్నారు. బోర్డు నిర్వహణ ఉద్యోగులకు వేతనాలు సహా ఉమ్మడి జలాశయాల నుంచి విడుదలయ్యే నీటిని లెక్కించేందుకు టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణకు నిధులు అవసరం. అయితే రెండురాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని బోర్డు అధికారులు చెప్తున్నారు. నిధులు, బడ్జెట్ కోసం ఇటీవల కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. 2014 -15 నుంచి ఇప్పటివరకు రూ. 47 కోట్ల 97 లక్షలు ఖర్చుచేసినట్లు కేఆర్ఎంబీ తెలిపింది.
ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు కూడా డబ్బుల్లేవు : ఇందులో ఏపీ రూ. 28 కోట్ల 26 లక్షలు, తెలంగాణ రూ. 19 కోట్ల 71 లక్షలిచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఏపీ ఎనిమిదిన్నర కోట్లు ఎక్కువగా విడుదల చేసినట్లు బోర్డు తెలిపింది. 2023 - 24లో ఏపీ ఆరు కోట్ల 70 లక్షలు విడుదలచేస్తే తెలంగాణ ఎలాంటి నిధులు ఇవ్వలేదని పేర్కొంది. బోర్డుకు నిధులు ఇస్తామని జనవరి 17న దిల్లీలో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించినట్లు గుర్తు చేసింది. ఆ తర్వాత తెలంగాణ నుంచి నిధులు విడుదల కాలేదని కేఆర్ఎంబీ పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలపై వివాదాలు తలెత్తుతున్నందున రెండోదశలో 9 చోట్ల టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటు సహా నిర్వహణకు నిధులు అవసరమని వివరించింది.
ఏపీ నిధులు, కేంద్రం నుంచి 2014-15లో వచ్చిన కోటి రూపాయలతో నెట్టుకొచ్చినట్లు బోర్డు తెలిపింది. ఈ నెల 12 వరకు బోర్డు వద్ద కేవలం 15 లక్షల 35 వేలు మాత్రమే ఉన్నాయన్న కేఆర్ఎంబీ ఉద్యోగులు, సిబ్బందికి ఏప్రిల్ వేతనాలిచ్చేందుకు అవి సరిపోవని వివరించింది. బోర్డుకు దాదాపు ఏడున్నర కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసిందని, ఐతే నిధులు ఇంకా అందలేదని పేర్కొంది. ఆవిషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బోర్డు నిధులు విడుదలయ్యేలా చూడాలని తెలంగాణ సభ్యులకు సూచించింది. 2024-25కి కృష్ణా బోర్డు బడ్జెట్‌ను రూ. 23 కోట్ల 17 లక్షలకు రూపొందించారు.
నిధులివ్వాలని రెండు రాష్ట్రాలకు విజ్ఞప్తి : బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, టెలీమెట్రీ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు అవి అవసరమవుతుందని అంచనా. ఆ మేరకు నిధులివ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఆంధ్రప్రదేశ్ 11 కోట్ల 9 లక్షలు, తెలంగాణ 19 కోట్ల 64 లక్షలు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది. బోర్డు సమావేశం తర్వాత నిధులు విడుదలపై రెండురాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని అనవసర ఖర్చులు నివారించాలని రెండు రాష్ట్రాలు బోర్డును కోరాయి. అయినా నిధులు మాత్రం రాలేదని కృష్ణా బోర్డు అధికారులు అంటున్నారు.
గోదావరి బోర్డు పరిస్థితి అలాగే ఉంది. జీఆర్ఎంబీకి సకాలంలో నిధులు విడుదల కావట్లేదని అధికారులు చెబుతున్నారు. ఏడాది నుంచి బోర్డుకు ఏ మాత్రం డబ్బులివ్వట్లేదని అంటున్నారు. రెండు రాష్ట్రాల నుంచి 7 కోట్లకు పైగా బకాయిలున్నాయని కొత్త సంవత్సరం బడ్జెట్ కోసం మరో 13 కోట్లు అవసరమని చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 12 కోట్ల 46 లక్షలు, తెలంగాణ నుంచి ఏడు కోట్ల 8 లక్షలు రావాల్సి ఉందని గోదావరి బోర్డు అధికారులు చెబున్నారు.
నిధులకోసం రెండు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. బోర్డులకు నిధులపై జనవరిలో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి, రెండురాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సరిపడా నిధులిస్తామని రెండు రాష్ట్రాలు హామీ ఇచ్చినా అది అమలు జరగడం లేదని బోర్డుల అధికారులు చెప్తున్నారు. 1వ తేదీ వస్తే బోర్డులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలివ్వడం ఇబ్బందికరమేనని అంటున్నారు.
కేఆర్ఎంబీ నిర్వహణకు దశల వారీగా నిధులు ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల అంగీకారం - States on KRMB Budget