Krishna Godavari Pavithra Sangamam Harathi: విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతులను పునరుద్దరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం పవిత్ర సంగమం ప్రాంతాన్ని పరిశీలించింది. అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. నవహారతులను 30 నుంచి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంత విశిష్టతను చెడగొట్టిందన్నారు.
నిత్యం ఇక్కడ కృష్ణమ్మకు ఇచ్చే జలహారతులను నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ముందు వరకు హారతులు కొనసాగాయని, నిత్యం వేలాదిమంది హారతి కార్యక్రమానికి హజరయ్యేవారని గుర్తుచేశారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేందంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాంతంలో 50 ఎకరాలు సేకరించి ఒక దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలాగే పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నదికి ఆవల వైపు ఉన్న లంక భూములను కూడా సేకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పవిత్ర సంగమం వరకు బోట్ షికార్, స్పీడ్ బోట్ వంటి ఏర్పాట్లు చేయాలని సంకల్పించామన్నారు. వైదిక కమిటీ సభ్యులతో చర్చించి ఏ ఆలయం కట్టాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. పవిత్ర సంగమం ఎప్పుడూ భక్తులతో, పర్యాటకులతో కిటకిటలాడేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు.
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా సంగమ ప్రాంతం: హారతుల నిర్వహణకు నెలకు రూ. 11 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దాతల సహాకారం కూడా తీసుకుంటామన్నారు. మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. పవిత్ర సంగమం ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామని, ప్రధానంగా సీఆర్‌డీఏ నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇతర శాఖలు వారి బడ్జెట్ ప్రకారం నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధటంతో పాటు భక్తులకు, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
కృష్ణమ్మకు ఇచ్చే నవహారతులతో మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని ఆకాంక్షించారు. పవిత్ర సంగమం ప్రాంతంను రాష్ట్రంలోనే ఐకానిక్ ప్రాంతంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో సైతం భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైనంత ప్లాట్ ఫాం ఎత్తు పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో కేఎస్ రామారావుతోపాటు ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రాథమికంగా రూ. 88 లక్షలకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనాలు వేసి మంత్రుల బృందానికి నివేదించారు. హైవే నుంచి ఘాట్ వరకు ఉన్న రహదారికి పూర్తి స్థాయిలో మరమత్తులు అవసరమని, అక్కడి నుంచే విద్యుత్తు వెలుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.
కృష్ణా హారతి పునఃప్రారంభం - మంత్రి ఆనం నేతృత్వంలో జీఓఎం సమావేశం - Ministers Committee Meeting