BRS Ex MLA Konappa Joins Congress : కుమురం భీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌లో చేరారు. ఆ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓటమి పాలై ఏమీ ఆశించకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం, కార్యకర్తలు ,అభిమానులు కోరినందుకు హస్తం పార్టీలో చేరారని స్పష్టం చేశారు.
Minister Seethakka on Telangana Development : మరోవైపు మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రంలోని మారుమూల గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఆయా పార్టీ విధానాలకు విసిగిపోయిన నాయకులు కాంగ్రెస్ పార్టీ పరిపాలనను గుర్తించి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లినవారు తిరిగి రావాలని అనుకుంటే తప్పకుండా వారిని ఆహ్వానిస్తామని సీతక్క తెలిపారు. పదవులు లేకున్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అగ్రనాయకుల కోసం రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పాలన @ 100 రోజులు - 5 హామీలను అమలు చేసిన సర్కార్
"కేసీఆర్ కుటుంబపాలనకు రాహుల్ గాంధీ కుటుంబపాలనకు చాలా వ్యత్యాసం ఉంది. ఒకరు చనిపోతే మరొకరు త్యాగాన్ని మోసుకొస్తూ దేశ సేవ చేస్తున్నారు. పార్టీని కాపాడుతూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం తపన పడుతున్నటువంటి కుటుంబం రాహుల్ గాంధీది అన్నారు. వారి కుటుంబంలో ఏ ఒక్కరికి పదువులు లేకున్నా ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పోడుభూముల చట్టం, విద్యా హక్కు, ఉపాధి హామీ ఇలాంటివన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని అందరు గుర్తుంచుకోవాలి." - సీతక్క, మంత్రి
ఎలాంటి పదవి కోసం కాంగ్రెస్‌లో చేరడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మంత్రి సీతక్కను కోరారు. పేద ప్రజల కోసం సీతక్క చేసిన కష్టాన్ని తాను చూశానని ఆమె శక్తి మేరకు సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
"ఏదో ఆశ పడి నేను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. సీఎం రేవంత్‌రెడ్డితో, సీతక్క ఇతర ముఖ్యనాయకులతో నేను మాట్లాడాను. కానీ నాకు దవి కావాలనీ కోరుకోలేదు. నాకు ఎలాంటి ఇంఛార్జి పదవులు అవసరం లేదు. సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రతిఒక్కరు సాయం చేయాలని కోరుతున్నాను." - కోనేరు కోనప్ప, కాంగ్రెస్ నేత
బీజేపీకి షాక్ - జితేందర్‌రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
13 స్థానాల అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు - హైదరాబాద్ సీటుపై స్పెషల్ ఫోకస్