Rammohan Naidu Takes Oath as Cabinet Minister: కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరుపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్‌నాయుడు చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ తరుపున కేంద్రమంత్రులుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మకు చోటు లబించింది.
శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రామ్మోహన్ నాయుడు : కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశీర్వాదమే తనను ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. తనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ, ప్రోత్సహిస్తున్న మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు, సోదర భావంతో చూస్తున్న లోకేశ్ అన్న, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీ, బాబాయి అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేసి నేను మూడు సార్లు గెలవడానికి కారణమయ్యారని పేర్కొన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మరో ప్రధాన కారణం మా శ్రీకాకుళం ప్రజలని మరోసారి పేర్కొన్నారు. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎంత వరకూ తీసుకొచ్చాయో ఈ రోజు అంతా చూస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తెలుగు ప్రజలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మనందరికీ చాలా ఉజ్వలంగా కనిపిస్తోంది. నరేంద్రమోదీ, చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు లభించిన ఈ మంత్రి పదవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదని మరో సారి గుర్తు చేస్తున్నా. తెలుగు ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా వారి కోసం మేం పనిచేస్తూ వచ్చాం. వచ్చే ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో మీకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున శక్తివంచన లేకుండా పనిచేసి మీకందరికి న్యాయం చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడతాం. ఏపీని అభివృద్ధి పఠంలో నిలిపి, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం తయారు చేయాలనేదే మా అందరి లక్ష్యం. రామ్మోహన్‌నాయుడు, కేంద్ర మంత్రి