18 Months Baby Girl Rare Treatment in KIMS : దేశంలోనే అత్యంత అరుదైన సవాలుతో కూడిన చికిత్స పద్దతిలో 18నెలల చిన్నారిని కొండాపూర్ కిమ్స్ కడల్స్ వైద్యులు కాపాడారు. ఛత్తీస్‌గడ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18నెలల పాప ప్రమాదవశాత్తు అలౌట్ సీసా మొత్తం తాగేసింది. దీనితో కెమికల్ న్యూమోనైటిస్‌కు గురైన బాధిత చిన్నారిని ఎక్మో పెట్టి విమానంలో తీసుకువచ్చిన పాపకు కిమ్స్ కడల్స్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు ఆసుపత్రి పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే వెల్లడించారు.
ఎక్మో పెట్టి రాయ్‌పూర్ నుంచి విమానంలో తెచ్చిన వైద్యులు : మొదటగా చిన్నారిని రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అక్కడి వైద్యులు తమను సంప్రదించారని తెలిపారు. వెంటనే కిమ్స్ వైద్యులు విమానంలో రాయ్‌పూర్ వెళ్లి చిన్నారిని పరిశీలించారని పేర్కొన్నారు. పాపకు ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్ల వల్ల కెమికల్ న్యూమోనైటిస్ సమస్య తీవ్రంగా ఉందని, బాధితురాలికి తగినంత ఆక్సిజన్ అందించడానికి వెంటిలేటర్ సరిపోకపోవడంతో ఆమె కుడివైపు గుండె కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే పాపకు ఎక్మో పెట్టి విమానంలో కొండాపూర్‌లోని తమ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించామని వైద్యులు వివరించారు.
A very Rare Treatment in India : పాపను 9 రోజుల పాటు వీఏ-ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడింది. అప్పుడు మరో అయిదారు రోజులు వెంటిలేటర్ మీద ఉంచారు. అనంతరం హైఫ్లో, లోఫ్లో ఆక్సిజన్ పెట్టారు. ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ రావడంతో యాంటీబయాటిక్స్ చికిత్స చేశారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. అన్నిరకాలుగా బాగుండటంతో గురువారం ఆమెను డిశ్చార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. వీఏ లేదీ వీవీ ఎక్మోపై పిల్లలను పెట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం అత్యంత అరుదు. అందులోనూ ముఖ్యంగా మెడ వద్ద కాన్యులా పెట్టి తరలించడం భారతదేశంలోనే అత్యంత అరుదైనది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన ఇలాంటి అతి కొద్ది కేసుల్లో ఇదొకటి.
"బాలికకు ఇచ్చిన చికిత్స వల్ల ఆమె గుండె, ఊపిరితిత్తులకు తగినంత మద్దతు లభించింది. కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్యబృందం వల్ల మాత్రమే ఆమెను ఎక్మో పెట్టి రాయ్‌పూర్ నుంచి విమానంలో హైదరాబాద్‌కు విజయవంతంగా తీసుకురాగలిగాం. అనుభవజ్ఞులైన కార్డియాక్, వాస్క్యులర్ సర్జన్లు ఉండటంతో రక్తనాళాల్లోకి కాన్యులేషన్ సరిగ్గా జరిగింది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని రకాల రోగులకు అత్యున్నత స్థాయి చికిత్సలు అందుతాయనడానికి ఈ కేసు ఒక నిదర్శనం."-డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాధిపతి
అత్యంత విషమంగా పీజీ వైద్య వైద్యార్థిని ఆరోగ్యం.. ఎక్మో సపోర్ట్‌తో చికిత్స