Kidney Patient Became Inter College Topper : ఆడుకునే వయస్సు నుంచే ఆ చిన్నారిని ఓ వ్యాధి బాధపెడుతోంది. అయినా పట్టువీడలేదు పదో తరగతిలో మంచి మార్కులతో కాలేజీ బాట పట్టింది. ఆరోగ్యం మరింత క్షీణించినా వెనుకడుగు వేయలేదు. మంచాన పడ్డా పుస్తకాలను వదల్లేదు. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో చదువు కొనసాగించింది. ఆఖరికి బుధవారం వెలువడిన ఫలితాల్లో కాలేజీ టాపర్‌గా నిలిచిన ఆ అమ్మాయి ఎవరంటే?
వారానికి రెండుసార్లు డయాలసిస్, ఒంట్లో శక్తి లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి అయినా పట్టువీడకుండా చదివిన ఆ పేదింటి బిడ్డ, ప్రతిభ కనబర్చి కళాశాల టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. బుధవారం వెలువరించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూనారపు సిరి సత్తా చాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. శారదానగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివిన సిరి సీఈసీ విభాగంలో 927 మార్కులతో ప్రతిభ కనబరిచింది. గోదావరిఖని ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన పోశం, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పోశం స్థానికంగా సెంట్రింగ్ పనులుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు తేజాలు - UPSC CIVILS RESULTS
ఆసక్తిని గుర్తించి అండగా నిలిచిన గురువులు : పెద్ద కుమార్తె సిరి గత ఐదు సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. రోజురోజుకీ వాటి పనితీరు మందగించడంతో ఇంటికే పరిమితమైంది. ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అప్పటి నుంచి వారానికి రెండుసార్లు రక్తశుద్ధి చేయించుకుంటుంది. చదువుపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సహ విద్యార్థుల ద్వారా ఆమెకు చేరవేసేవారు. సిరికి వచ్చిన సందేహాలను సెల్ఫోన్లో నివృత్తి చేసేవారు.
ఆమె పరిస్థితిని చూసి దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. పాఠ్యపుస్తకాలతో కుస్తీపట్టిన సిరి సొంతంగా చదువుకొని పరీక్షలు రాసి కళాశాల టాపర్‌గా నిలిచింది. సిరి కిడ్నీ మార్పిడి చేయించే స్థోమత తమకు లేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, దాతలు స్పందించి చేయూత అందించాలని తండ్రి పోశం కోరుతున్నారు.
Umesh Varun 3rd rank in TS EAMCET తెలంగాణ ఎంసెట్‌లో సత్తా చాటిన నందిగామ విద్యార్థి