Khammam Singareni Colony Locals Problems : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి సంస్థ భూ సేకరణ సమయంలో నిర్వాసితుల నుంచి స్థలాలను సేకరించుకొని ఉపరితల గని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ జేకే 5 ఉపరితలగని సింగరేణికే తలమానికంగా లాభాలు ఆర్జిస్తోంది. కానీ దీని కోసం భూములు ఇచ్చిన స్థానికులకు మాత్రం తీరని శోకాన్ని మిగులుస్తోంది. ఉపరితల గని కోసం 2008లో సింగరేణి అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించారు.
పట్టణంలోని హమాలి బస్తీ, కళాసి బస్తీ, మంతిని ఫైల్ బస్తి, బాటన్ ఫీట్ బస్తీలకు చెందిన 600 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. గని కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారితో కలిపి సుమారు 1420 మందికి 2012లో సింగరేణి సంస్థ నష్ట పరిహారం చెల్లించింది. అలాగే స్థానిక జెకె సిఇఆర్ క్లబ్ సమీపంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేసి ఇంటి నిర్మాణం కోసం బాధితులకు స్థలాలు ఇచ్చింది. ఈ స్థలాల్లో నిర్వాసితులు ఇంటి నిర్మాణం చేసుకున్నారు. ప్రస్తుతం 400 కుటుంబాలు నివసిస్తున్నాయి.
సింగరేణి కాలనీ బస్తీవాసుల క'నీటి' కష్టాలు..
ఇంతవరకూ బాగానే ఉన్నా 2008 నుంచి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న 400 కుటుంబాల నిర్వాసితులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో కాలనీ వాసులకు సింగరేణి నీటితోపాటు పురపాలిక ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. పురపాలిక నీటిని అందిస్తుందనే ఉద్దేశంతో ఇటీవల సింగరేణి అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. బల్దియా నుంచి రెండు రోజులకోసారి నీళ్లు వస్తుండటంతో అవి ఏమాత్రం చాలటం లేదని కాలనీవాసులు చెబుతున్నారు.
సింగరేణి కాలనీ బస్తీవాసుల క'నీటి' కష్టాలు..
నిర్మించుకున్న ఇళ్లకు ఇవ్వని నంబర్లు : వేసవిలో సమస్య తీవ్రంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. సమీపంలో సింగరేణి డి బ్లాకు నుంచి నిత్యం దుమ్ము, ధూళి కాలనీని కమ్మేస్తోంది. దీంతో స్థానికులు శ్వాస కోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నిర్వాసితుల్లో కొందరు ఇళ్ల స్థలాలు విక్రయించారు. వాటిని కొని సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లు ఇవ్వడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. శివారు ప్లాట్లలో నేటికి విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయలేదు.
"మా భూములు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. 200 గజాల స్థలం ఇస్తామని చెప్పి, 80 గజాల స్థలం ఇచ్చారు. ప్యాకేజీ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. సింగరేణిలో చిన్నపాటి ఉద్యోగాలు కూడా కల్పించలేదు. మాకు ఎలాంటి ఆధారం లేకుండా చేశారు. ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకున్న దానికి పట్టా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి. - భూ నిర్వాసితులు, భద్రాద్రి కొత్తగూడెం
నిర్వాసితుల్లో పశు సంపద ఉన్నవారికి చావిడి కోసం మొదట్లో స్థలం కేటాయించారు. కొద్ది రోజులకే తిరిగి ఆ స్థలాన్ని హరితహారం అభివృద్ధికి పురపాలికకు ఇచ్చారు. దాంతో అధికారులు అందులో చిట్టడివి ఏర్పాటు చేశారు. శ్మశాన వాటికలో నీటి సదుపాయం లేదు. శౌచాలయాలూ లేవు. కాలనీలో పార్కు నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేయడంతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అర్జీలు పెట్టుకున్న తీరని సమస్యలు : స్థానికంగా ఉంటున్న కాలనీవాసులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామంటున్నారు. సింగరేణి, పురపాలిక, రెవెన్యూ అధికారులకు పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పాటులో పలు సౌకర్యాలు కల్పిస్తామన్న సింగరేణి అధికారులు ఇప్పుడు తమను విస్మరిస్తున్నారని నిర్వాసిత కాలనీ వాసులు వాపోతున్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల అరెస్టు.. నిరసనగా సర్పంచ్ ఆమరణ నిరాహార దీక్ష
ఇళ్లు కూల్చివేత.. రోడ్డున పడ్డ భోగాపురం విమానాశ్రయం నిర్వాసితులు