Khairatabad Ganesh History : గణపతి బప్పా మోరియా అంటూ పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ మట్టి గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్‌కి బారులు తీరారు. ఆదివారం సుమారు 3 లక్షల మందికి పైగా స్వామి వారిని దర్శించుకున్నట్టు కమిటీ సభ్యులు వివరించారు. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి భక్తులు వచ్చారని తెలిపారు.
అతి పెద్ద మట్టి విగ్రహం : 70 అడుగుల ఎత్తులో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అత్యంత ప్రత్యేకమైన రూపంగా చెప్పవచ్చు. మండపైనే స్వామికి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఇక ప్రధాన గణపతి మండపానికి ఓ వైపు శ్రీనివాస కల్యాణం, మరోవైపు శివపార్వతుల కల్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను ఏర్పాటు చేశారు.
తిలక్ ప్రేరణతో : వాస్తవానికి ఖైరతాబాద్ గణనాథుడిది దశాబ్దాల చరిత్ర. 1954వ సంవత్సరం నుంచి ఖైరతాబాద్‌లో గణేశ్ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్ ప్రేరణతో నగరానికి చెందిన సింగరి శంకరయ్య, 1954లో మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్‌లో వినాయకుడిని ఏర్పాటు చేశారని ఉత్సవ కమిటీ వారు చెబుతున్నారు. అలా ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్, నాటి నుంచి ఏటా ఒక అడుగు ఎత్తు పెరుగుతూ వచ్చాడు.
70 ఏళ్లు పూర్తి : ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారమూ అత్యంత ప్రత్యేకమనే చెప్పాలి. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఇక్కడి గణేశుడు. 2014 నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని ఏటా ఒక అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకు ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకువచ్చారు. తిరిగి భక్తుల కోరిక మేరకు 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటం విశేషం.
2020లో కొవిడ్ నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తులో గణపతిని ఏర్పాటు చేయగా, గతేడాది 63 అడుగుల వినాయకుడు ఖైరతాబాద్ భక్తులకు కనువిందు చేశాడు. ఇక ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కనువిందు చేశాడు. మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, సెన్సేషన్ థియేటర్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్క నుంచి ట్యాంక్ బండ్‌పైకి చేరుకోనున్నాడు. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో సుమారు 700 మంది పోలీసు బందోబస్తు మధ్య మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
గణేశ్ నిమజ్జనం స్పెషల్ - 17న అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు - HYDERABAD METRO TIMINGS EXTENDED