KCR Guides BRS Leaders On Assembly Sessions Today : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతోంది. నూతన శాసనసభ మొదటి, బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారత్ రాష్ట్ర సమితి ఎత్తుకు పై ఎత్తులతో వేడిని రగిల్చాయి. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో సర్కారును నిలదీసేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.
అనారోగ్యం కారణంగా బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అధినేత హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలునే ప్రధానంగా ప్రస్తావించేందుకు ప్రధాన ప్రతిపక్షం సన్నద్ధమైంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం - పోలీసుల మూడంచెల భద్రత - Telangana Assembly Sessions 2024
ఆరు గ్యారెంటీలు, అందులోని 13 హామీలు, వాటి చట్టబద్ధత, ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించే ఆలోచనలో విపక్ష సభ్యులు ఉన్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు - జాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం, రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి లాంటి అంశాలపై ప్రశ్నించాలని భావిస్తున్నారు.
ఆరు గ్యారంటీల అమలు, శాసనసభలో చట్టబద్దత, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు - నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం - రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతు సమస్యలను సమావేశాల్లో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం - పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం, ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, లాంటి ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తున్నారు.
హామీల అమలు, వైఫల్యంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి, సంబంధిత అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. నిధులు ఇవ్వకపోవడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం, పెట్టుబడులు తరలడం, నగర ప్రతిష్ట దిగజారేలా సర్కార్ చర్యలు, తదితరాలను ప్రస్తావిస్తామని అంటోంది. కేసీఆర్ చేసిన అభివృద్ధిని కొనసాగించడంలోనూ సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా పోరాడతామని బీఆర్ఎస్ సభ్యులు చెబుతున్నారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో జరగనున్న సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై వారికి మార్గనిర్ధేశం చేస్తారు. శాసనసభ బీఏసీ లో ప్రతిపక్షనేత కేసీఆర్తో పాటు గతంలో పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ్యునిగా ఉన్నారు. ఆయన లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఏసీ సభ్యునిగా మాజీ మంత్రి హరీశ్ రావు హాజరవుతారని బీఆర్ఎస్ శాసనసభాపక్షం సభాపతికి లేఖ ఇచ్చింది.