KCR Brother Son Arrested : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు మన్నెగూడలో భూ ఆక్రమణ, హత్యాయత్నం కేసులో మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మార్చి 3న ఈ కేసు నమోదు కాగా అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో బాలాపూర్‌లో కన్నారావు ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకున్నామని, అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Kalvakuntla Kanna Rao Land Grab Case : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడలోని సర్వేనెంబరు 32/ఆర్యూయూలో జక్కిడి సురేందర్‌రెడ్డికి 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. 2013లో చామ సురేశ్ వద్ద రూ.50 లక్షలు తీసుకొని సురేందర్‌రెడ్డి జీపీఏ చేశాడు. రూ.50 లక్షలు తిరిగి ఇచ్చినప్పుడు భూమి తనకు అప్పగించాలని ఒప్పంద పత్రం రాసుకున్నారు. 2020 వరకు సురేందర్‌రెడ్డి డబ్బు ఇవ్వకపోవడంతో సురేశ్ ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఓఎస్ఆర్ సంస్థకు విక్రయించాడు.
భూమి దక్కకపోవడంతో కక్ష పెంచుకున్న సురేందర్‌రెడ్డి తన ప్రమేయం లేకుండా భూమి ఎలా కొనుగోలు చేస్తారని ఓఎస్ఆర్ సంస్థ నిర్వాహకులతో తరచూ ఘర్షణకు దిగేవాడు. ఈ ఫిబ్రవరిలో సురేందర్, ఆయన సోదరులు, ఇతర అనుచరులతో కలిసి భూమిలోకి బలవంతంగా ప్రవేశించి బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై ఓఎస్ఆర్ సంస్థ ఫిర్యాదుతో ఆదిభట్ల ఠాణాలో కేసు నమోదైంది. అయినా తీరుమార్చుకోని వారు భూమి ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేశారు.
Kalvakuntla Kanna Rao Case Updates : తెలిసిన వారి ద్వారా మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్ కన్నారావును సురేందర్‌రెడ్డి ఆయన సోదరులు సంప్రదించారు. భూమికి తమకు దక్కేలాచేస్తే కోటికిపైగా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మార్చి 3న సురేందర్‌రెడ్డి, హరినాథ్, కల్వకుంట్ల కన్నారావు, సురేశ్, డేనియల్ తదితరులు దాదాపు 20 మందికిపైగా అనుచరులు ఆయుధాలతో ఆ భూమిలోకి ప్రవేశించి ప్రహరీని కూల్చేసి పనిచేసే సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కంటెయినర్, గుడిసెను దగ్ధం చేసి భయానక పరిస్థితి సృష్టించారు.
కన్నారావుకు 14 రోజుల రిమాండ్ : ఓఎస్ఆర్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీబీ డ్రైవర్ సహా మరో ముగ్గుర్ని అరెస్టు (Kalvakuntla Kanna Rao Arrest)చేసి రిమాండుకు తరలించారు. మొత్తం 38 మందిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కన్నారావు సహా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారికోసం ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులు గాలించారు. ముందస్తు బెయిల్‌కు రెండుసార్లు కన్నారావు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బాలాపూర్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. కేసుపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కల్వకుంట్ల కన్నారావు చెప్పారు.
కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్ - చర్లపల్లి జైలుకు తరలింపు - KCR brother son arrested