Rain Problems In Karimnagar : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నీట మునిగే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని రూ.130 కోట్ల రూపాయలతో అంతర్గత, ప్రధాన రహదారుల గుండా వరద కాలువలు నిర్మాణానికి 2022లో శ్రీకారం చుట్టారు. ప్రధానంగా కరీంనగర్-జగిత్యాల రహదారిలో ఆర్టీసీ వర్క్‌షాపు వద్ద రెండు పర్యాయాలు వరద నీరు నిలిచిపోవడం రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లు పూర్తవుతున్నా పనులు పూర్తి కాలేదు. కరీంనగర్‌లోని వరద ఎన్‌జీవోఎస్ కాలనీ గుండా లక్ష్మీనగర్ మీదుగా మానేరు నదిలోకి వెళ్తుంది. ఐతే ఈ మార్గంలోని వరద కాల్వ పూర్తిగా శిథిలమైంది. రెండు వైపులా గోడలు పడిపోయి మట్టి పేరుకుపోతోంది. ఈ పనులు పూర్తి చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Heavy Rain Water On Road In Karimnagar : కరీంనగర్‌లోని హుస్సేనిపుర ప్రధాన రహదారి నుంచి వీధుల్లోకి వెళ్లే రహదారి కల్వర్టు ఇరుకుగా ఉంది. ఇక్కడ వరద కాలువ నిర్మించాల్సి ఉండగా అలాగే వదిలేశారు. ఏళ్ల తరబడి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుండగా ఆ సమస్య అలాగే ఉండిపోయేలా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వరద నీటి సమస్య పరిష్కారం కాగా మరికొన్ని చోట్ల అసంపూర్తిగా వదిలేశారు. వర్షాలకు రోడ్లపైకి నీరు రావడంతో అప్పటి అధికారులు పర్యటించి వరద ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని గుర్తించారు.
"మూడు సంవత్సరాల నుంచి వరద నీటితో ఇబ్బంది పడుతున్నాం. నాలుగైదు డివిజన్ల నీరంతా చేరి సీతారాంపూర్లోకి చేరుతోంది. దీనివల్ల ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా నీరు రోడ్డుపైకి రావడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. మాజీ మంత్రి కూడా దీన్ని స్మార్ట్ సిటీ కింద పనులు చేస్తామన్నారు కానీ అవి కాలేదు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు కానీ పూర్తిగా కట్టలేదు. మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది త్వరగా డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం." - స్థానికులు
ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికలు చేసినా ఆ పనుల జాడే లేదు. ఎండాకాలంలో అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాల్సి ఉండగా సాధారణ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు, ఎన్నికల కోడ్ కారణంగా కాలయాపన చేశారు. అధికారులు, నాయకులు స్పందించి అంసంపూర్తిగా ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.