Kaleshwaram SI Bhavani Sen Dismissed From Job : పోలీస్ అంటే ఆపదనుంచి కాపాడాతారన్నది ప్రజల నమ్మకం. కానీ ఆ నమ్మకాన్నే వమ్ము చేస్తూ అఘాయిత్యానికి పాల్పడితే, తోటి మహిళా కానిస్టేబుల్ అని కూడా చూడకుండా బెదిరించి, భయపెట్టి లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడితే, సర్వీస్ రివాల్వర్ చూపించి చంపేస్తానని బెదిరిస్తే, పోలీస్ అయినా ఆ బాధితురాలకు దిక్కెవ్వరు? కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భవానీసేన్, తోటి మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపరిచింది.
నాలుగు రోజుల క్రితం స్టేషన్లో తన విధులు ముగించుకుని, బాధితురాలు తన గదికి రాగా, అర్ధరాత్రి సమయంలో ఎస్ఐ ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించినా, ఎస్ఐ రివాల్వర్ చూపించి ఆమెను భయపెట్టాడు. అరిస్తే చంపేస్తానంటూ, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పినా నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు.
Minister Sridhar Babu on Kaleshwaram SI Issue : ఎస్ఐ దాష్టీకంపై మహిళా కానిస్టేబుల్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ జరిపి, కేసు నమోదు చేసి ఇవాళ ఉదయం భవానీసేన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం భూపాలపల్లి కోర్టుకు తరలించారు. న్యాయస్ధానం రిమాండ్ విధించగా, ఎస్‌ఐను అక్కడి నుంచి కరీంనగర్ జైలుకు తరలించారు. కాళేశ్వరంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఈ ఘటనపై స్పందిస్తూ తెలిపారు.
సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు : 2022 జులైలో అసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో లైంగిక దాడులకు పాల్పడడంతో అప్పట్లోనే భవానీసేన్‌పై కేసు నమోదైంది. పోలీస్‌గా తన హోదా అడ్డుపెట్టుకుని, మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను లైంగిక దాడులకు పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్నాయి.
ఎస్ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ఠ దిగజార్చే విధంగా ఉంది. ఎస్ఐపై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్ఐ భవానిసేన్పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లుగా మల్టీజోన్ I ఐజీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.