Kadapa Police Arrested Two Persons and Recover 37 Cars : సులువైన మార్గంలో డబ్బులు సంపాదించేందుకు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త రకాల చీటింగ్‌లు చేస్తున్నారు. కాని చివరకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా కడపలో యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకుని వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి యజమానులను బురిడి కొట్టిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కార్లను కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
కార్ల యజమానులను బురిడి కొట్టించి : కడప నగరంలోని నబీ కోటకు చెందిన వెంకటశశిధర్ రెడ్డి, షేక్ జిలానీ కార్ల యజమానులను బురిడి కొట్టించారు. అద్దె పేరుతో కార్లు తీసుకున్నఇద్దరు మరొకరి వద్ద తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. కారు విలువ ఎంతన్నదానితో సంబంధం లేకుండా తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగాలేదని కారు పెట్టుకుని 2 నుంచి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిసిన వారి దగ్గర తాకట్టు పెట్టేవారు. ఈ విధంగా జనవరి నుంచి ఇప్పటివరకు 37 కార్లు తాకట్టు పెట్టి 47 లక్షల రూపాయలు కాజేశారు.
"యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకుని వెంకటశశిధర్ రెడ్డి, షేక్ జిలానీ వ్యక్తులు మోసం చేశారు. 15 మంది యజమానుల నుంచి 37 కార్లు తీసుకుని వాటిని యజమానులకు తెలియకుండా ఇతరుల వద్ద తాకట్టు పెట్టారు. వీరేందర్ అనే కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. నిందితుల నుంచి కార్లు స్వాధీనం చేసుకున్నాం. మోసపోయిన యజమానులు కోర్టు ద్వారా కార్లను తెచ్చుకోవాలని కోరుతున్నాం." - హర్షవర్ధన్ రాజు, కడప జిల్లా ఎస్పీ
యజమానులకు తెలియకుండా తాకట్టు : వెంకటశశిధర్ రెడ్డి అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత వదిలేశాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఆ సమయంలో శశిధర్ రెడ్డికి జిలానీ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకుని రోజువారిగా డబ్బులు చెల్లించి తిప్పుకునే వారు. ఇది చాలదన్నట్లు నెలవారిగా ప్రభుత్వ కార్యాలయాలకు కార్లను అద్దెకు ఇస్తామని వాటికి 30 నుంచి 35 వేల రూపాయలు యజమానులకు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.
నిందితుల నుంచి 37 కార్లు రికవరీ : జనవరి నుంచి వరసగా రెండు మూడు నెలలు బాగానే అద్దె చెల్లించడంతో యజమానుల్లో నమ్మకం కుదిరింది. ఆ తర్వాత యజమానులకు అద్దె చెల్లించకుండా కార్లను చూపించకుండా మూడు నెలల నుంచి నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన వీరేందర్ అనే కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకొన్నారు. 15 మంది యజమానుల నుంచి 37 కార్లు తీసుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోసపోయిన యజమానులు కోర్టు ద్వారా కార్లను తెచ్చుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు.
కొత్త కారు కొనాలా? ఈ 'ఎక్స్ట్రా ఖర్చులు' గురించి కచ్చితంగా తెలుసుకోండి! - Car Expenditure