Justice PC Ghose Commission on Kaleshwaram Project : కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె నుంచి వివరాలు, సమాచారం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం లేదా సోమవారం రావాలని ఆయనను కమిషన్ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు పత్రికల్లో కథనాలు, వివిధ సందర్భాల్లో శ్రీరాం వెదిరె మాట్లాడిన నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆయన నుంచి సమాచారం, వివరాలు తీసుకోవాలని భావిస్తున్నారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పని చేసిన అధికారులను కూడా కమిషన్ విచారణకు పిలవనుంది. సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్ఎస్, వ్యాప్కోస్ తదితర సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిచే ఆలోచనలో కమిషన్ ఉంది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ అందులోని కొన్ని అంశాలపై వివరణ కోరింది. తమకు కొన్ని డాక్యుమెంట్లు కావాలని నిపుణుల కమిటీ కోరింది. నిపుణులకు ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది.
కాళేశ్వరం ఆనకట్టల పనుల్లో సబ్ కాంట్రాక్టర్లు కూడా పనులు చేసినట్లు కమిషన్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఒక సంస్థలో పని చేసిన ఓ వ్యక్తి ప్రాజెక్టు పనుల సమయంలో విభేదించి బయటకు వెళ్లారని, ఆయనతో పాటు ఇతరులను కూడా పిలిచే యోచనలో కమిషన్ ఉంది. నేడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 20 డిప్యూటీ ఈఈలు, ఇద్దరు అకౌంటెంట్ ఆఫీసర్లు హాజరయ్యారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్ ఆ అంశాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బుధవారం ఏఈఈలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు.