Justice PC Ghosh Commission Inquiry Update: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరంపై జరుగుతున్న న్యాయ విచారణ కమిషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కమిషన్‌కు ఇద్దరు సీనియర్ ఇంజినీర్లను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిషన్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. విచారణ ప్రారంభించే ముందుగానే కొందరు ఇంజినీర్లు టెలీ కాన్ఫరెన్స్ పెట్టుకుని కూడబలుక్కున్నట్లు వెలుగులోకి రావడంతో జస్టిస్ పీసీ ఘోష్ తీవ్రంగా పరిగణించారు. ఈ నెల ఏడో తేదీన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఇంజినీర్లను కమిషన్ విచారణకు హాజరవ్వాలని పిలిచింది. దీనికి ముందురోజు ఓ ఇంజినీర్ ఇన్‌చీఫ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, కమిషన్ ముందు అందరూ ఒకే రకంగా చెప్పాలని సూచించినట్లు సమాచారం.
అందరం ఒకే మాట చెప్పాలి : ఈ కాన్ఫరెన్స్ 45 నిమిషాల పాటు సాగినట్లుగా, అందులో పలు అంశాలు చర్చించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కమిషన్ కూడా నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను పిలిచి ఆరా తీయడంతో ఇది సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీనియర్ ఇంజినీర్లను కమిషన్ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని నీటి పారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
గత నెలలో కమిటీ ఏర్పాటు : నీటి పారుదల శాఖ న్యాయ విచారణ కమిషన్‌కు సాయంగా నలుగురు నిపుణులతో కూడిన కమిటీని గత నెల 22న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఈఎన్సీ కన్వీనర్‌గా ఉండగా, కమిటీ నుంచి ఈఎన్సీని దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. గురువారం పీసీ ఘోష్ నిర్వహించిన సమావేశంలో సైతం ఈఎన్సీ హాజరు కాలేదని తెలిసింది. మరోవైపు ఓ అండ్ ఎం ఈఎన్సీని కూడా కమిషన్ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కమిషన్ ఎదుట విచారణకు ఆ ఇద్దరు! : ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజినీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగంలోని ఇంజినీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ వారిని విచారణ చేస్తోంది. అవసరమైన అంశాలపై సమాచారం, వివరాలు సేకరిస్తోంది. అటు కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటోంది. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలు సేకరిస్తోంది.
జగన్ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM