Justice PC Ghose Commission on Kaleshwaram Project : కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ ఇంజినీర్ల విచారణను దాదాపుగా పూర్తి చేసింది. మొదటి దశలో మూడు ఆనకట్టలతో సంబంధం ఉన్న ప్రస్తుత, గత ఇంజినీర్లను కమిషన్ విచారణ చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు ఆ తర్వాత వారు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. తాజా విడతలో మూడు పంప్ హౌస్‌లకు సంబంధించిన ఇంజినీర్లను కూడా కమిషన్ విచారణ చేసింది. మొదట సీఈ మొదలు డిప్యూటీ ఈఈ స్థాయి వరకు ఇంజినీర్ల విచారణ మంగళవారం వరకు పూర్తయింది.
నేడు పంప్ హౌస్‌లకు చెందిన ఏఈఈలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. పంప్ హౌస్‌ల నిర్మాణం, డిజైన్లు, నీటి నిల్వ సామర్థ్యం, ఆనకట్టల ఎత్తు, గతంలో పంప్ హౌస్‌లు మునిగిన సందర్భాలు, అప్పుడు తీసుకున్న చర్యలు, సంబంధిత అంశాలపై వారి నుంచి కమిషన్ వివరాలు తీసుకొంది. వారందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించారు. రేపటి నుంచి ట్రాన్స్‌కో ఇంజినీర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తులను విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
Kaleshwaram Irrigation Project Issue : జూన్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మొదటగా నీటిపారుదలకు సంబంధించి, ప్రాజెక్టు ఇంజినీర్లను ప్రశ్నిస్తూ వచ్చింది. అందులో భాగంగా ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించింది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణను కూడా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు పని చేసిన ప్రతి నీటిపారుదల ఇంజినీరును కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్ వేగాన్ని మరింత పెంచింది. అలాగే కొందరు సీనియర్ ఇంజినీర్లతో కమిషన్ రెండు, మూడు రోజుల పాటు విచారణ చేపట్టింది.