Judicial Inquiry On Kaleshwaram Project : మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వివరాలు సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ జరుపుతున్న కమిషన్ ఇవాళ నల్లా వెంకటేశ్వర్లును పిలిపించింది. ఆనకట్టల నిర్మాణ సమయంలో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకొంది. ఆనకట్టకు ఎంపిక చేసిన స్థలం, చేసిన పరీక్షలు, డిజైన్లు, నమూనాలు, మార్పులు - చేర్పులు, నాణ్యత, నీటి నిల్వ, నిర్వహణకు సంబంధించిన అంశాల గురించి ఆరా తీసినట్లు సమాచారం.
PC Ghosh commission On Medigadda : కేవలం బ్యారేజీగా ఉపయోగించేందుకు వీలుగా నిర్మించి ఆ తర్వాత నీటిని ఎందుకు నిల్వ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. 2019లోనే సీసీ బ్లాకులు దెబ్బతినడం సహా ఇతర సమస్యలు వచ్చినప్పటికీ ఎందుకు మరమ్మతులు చేయలేదని అడిగినట్లు సమాచారం. పియర్స్ కుంగడానికి కారణాలు ఏమై ఉండవచ్చని ఆరా తీసినట్లు తెలిసింది. అన్ని అంశాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని నల్లా వెంకటేశ్వర్లును కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కాళేశ్వరంపై న్యాయవిచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ తన విచారణలో వేగం పెంచింది. మేడిగడ్డ బ్యారెజీలో కుంగిన ప్రాంతాన్ని ఇప్పటికే స్వయంగా పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ సంబంధిత అధికారుల నుంచి వివరాలను సేకరించింది.
ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ కీలక సూచనలు : వర్షాకాలం రాబోతున్న నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీకి వరదల నుంచి ముప్పు రాకుండా తగిన చర్యలపై దృష్టి పెట్టాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఘోష్ సూచించారు. అందుకోసం నిపుణుల సూచనలు తీసుకోవాలన్నారు. హైడ్రాలజి, ఎలక్ట్రికల్, సివిల్, జియోలాజికల్ తదితర రంగాల నిపుణుల సూచనలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించినట్లుగా వర్షాకాలం వరకు అన్ని గేట్లు తెరిచి ఉంచడంతో పాటు నదికి ఎగువ, దిగువన రక్షణ చర్యలు తీసుకోవాలని రక్షణ చర్యలు అమలు చేయాలని కమిషన్ సూచించినట్లు సమాచారం.