Justice PC Ghose Commission Inquiry on Kaleshwaram : కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. 100 రోజుల్లో విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం నాడు కమిషన్ ఛైర్మన్ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్‌తో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ వారికి స్వాగతం పలికారు.
Kaleshwaram Barrages Issue Updates : ఈ సందర్భంగా లాంజ్‌లో జస్టిస్ పీసీ ఘోష్ వారితో గంటపాటు భేటీ అయ్యారు. ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణకు అవసరమైన వనరులు, సాంకేతిక సిబ్బందిపై తొలిరోజు కమిషన్ దృష్టిసారించినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం కానుంది. 26న మూడు ఆనకట్టలను సందర్శించనుంది.
బీఆర్కే భవన్‌లో కలిసిన ఈఎన్సీ బృందం : హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఎనిమిదో అంతస్తులో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయానికి చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్‌ను నీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో ఓఅండ్‌ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్, హైదరాబాద్ సీఈ ధర్మా తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
పూర్తి సమాచారం సమర్పణ : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషన్ కోరింది. దీంతో నీటిపారుదల రంగంపై సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రం, మూడు ఆనకట్టలపై విజిలెన్స్ విచారణకు సంబంధించిన సమాచారం, జాతీయ డ్యాం భద్రతా సంస్థ(ఎన్డీఎస్‌ఏ) పలు దఫాలుగా నిర్వహించిన విచారణకు సంబంధించి వివరాలు, కాగ్ నివేదికలను అధికారులు అందజేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఆనకట్టలకు సంబంధించిన నివేదికలను కూడా సమర్పించారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఇవాళ అందజేయనున్నట్లు తెలిసింది.
తొమ్మిది మందితో కూడిన నోడల్ టీం : కమిషన్ కోరే సమాచారాన్ని అందించేందుకు, ఇతరత్రా సహాయకులుగా ఉండేందుకు బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించడంతో తొమ్మిది మందితో కూడిన నోడల్ టీంను నియమిస్తూ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వం వహిస్తారు. నోడల్ టీంలో ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్, ఈఈలు టి.వేణుగోపాల్,జి.జ్ఞానేశ్వర్‌రెడ్డి డీఈఈ వి.వేణు, ఏఈఈలు దీక్షిత్, బి.గోపి, సదత్ షేక్ ఉన్నారు.
బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? - అధికారులపై ఎన్డీఎస్‌ఏ కమిటీ ప్రశ్నల వర్షం