Jagan Cheated NTR District People by Giving False Promises: మాట తప్పను మడమ తిప్పను ఇదీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరచూ బహిరంగ సభల్లో చెప్పే మాటలు. వాస్తవ పరిస్థితులు చూస్తే జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన కనిపించడం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాను పలుమార్లు సందర్శించిన జగన్ అనేక హామీలు ఇచ్చారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఐదేళ్లు గడిచినా ఇవి ఇప్పటికీ నెరవేరలేదు. ప్రజల సమస్యలు తీరలేదు.
అధికారంలోకి రాగానే ఇస్తామని: విజయవాడలోని కొండలపై నివాసం ఉంటున్న వారి ఇళ్లకు ప్రభుత్వం నుంచి నామమాత్ర పట్టాలు మాత్రమే ఉన్నాయి. ఈ సమస్యను అప్పటి ప్రతిపక్షనేత జగన్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి స్థలాలకు రిజిస్ట్రేషన్‌తో కూడిన పట్టాలను ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారం మారుతున్నా అది అమలుకు నోచుకోలేదు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి తాగునీటి కొరత లేకుండా పూర్తిస్థాయిలో అందించేందుకు కృష్ణా నది నుంచి నీటిని పంపించే ఏర్పాటు చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. అదీ పరిష్కరించలేదు. అధికారంలోకి రాగానే సుబాబుల్ కర్రకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కర్రను మొత్తం కొనుగోలు చేయిస్తామని నందిగామలో ప్రచారానికి వచ్చినపుడు అన్నారు. ఇంతవరకు కర్రను ప్రభుత్వం కొనుగోలు చేయనేలేదు. దీనిపై మంత్రుల ఉప సంఘం ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని సుబాబుల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భగీరథునిలా హామీలు అడుగు పడని పనులు - హంద్రనీవాకు నీళ్లు రావా జగన్? - Handriniva Project
వారానికి రెండు సార్లు కూడా రావడం లేదు: తిరువూరు నియోజకవర్గంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో జోన్- 2, 3 కాల్వల ద్వారా సాగర్ జలాలను పూర్తిస్థాయిలో తెచ్చి నాలుగు మండలాల్లోని 300 చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసి పంటలకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన జగన్ హామీ నేటికీ నెరవేరలేదు. ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్న తిరువూరు ప్రాంతంలో వారానికి రెండుసార్లు అయినా రక్షిత మంచినీరు రావడం లేదు. 164 కోట్ల రూపాయల ఏఐబీబీ(AIBB) నిధులతో నిర్మాణం ప్రారంభించిన రక్షితనీటి ప్రాజెక్టు పునాదుల దశలోనే ఆగిపోయింది. కాకర్ల గ్రామంలో ఉన్న 1200 ఎకరాల అటవీ భూమిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఉపాధిని పెంపొందించే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం నాడు భరోసా ఇచ్చారు. ఇవేమీ కాగితం దాటి బయటకు రాలేదు.
ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు: మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలేవీ నెరవేరలేదు. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ భూముల్లో సెజ్ లు ఏర్పాటు చేసి పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో కాలంగా కోరుతున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. తిరువూరు ప్రాంత అటవీభూముల్లో పట్టాలు మంజూరు చేస్తామని ఇచ్చిన భరోసా నెరవేరలేదు.
ఉచిత కరెంటు ఇస్తామని మోటార్లకు మీటర్లు ఏంటి ? - ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం - Farmers Protest
సాగునీటికి సమస్యే: తిరువూరు మండలంలోని ఏడు చెరువులకు సాగునీరు అందించే రాకెట్ సప్లయ్ ఛానల్‌కు రెండో జోన్‌లోని నాగార్జున సాగర్ ప్రధాన కాల్వ నుంచి లింక్ ఛానల్ ఏర్పాటు చేసి రైతుల సాగునీటి సమస్య తీరుస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో మామిడి పంట అత్యధికంగా సాగు చేస్తున్నా రైతులకు గిట్టుబాటు ధర రానందున మామిడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఇచ్చిన మాటకు అతీగతి లేదు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగుపై ధ్వంసమైన వంతెన స్థానంలో కొత్తది నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అదీ సాకారం కాలేదు. ఎ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా గిరిజనులు మూత్రపిండాల వ్యాధులతో పిట్టల్లా రాలిపోతున్నారు.
జగ్గయ్యపేట ప్రాంతంలో పెరుగుతున్న కర్మాగారాల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు. ఆటోనగర్, పారిశ్రామికవాడల్లో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. జగ్గయ్యపేట ప్రాంతానికి ఉన్న ప్రకృతి వనరుల రీత్యా ఇక్కడ పర్యాటక కేంద్రం అభివృద్ధి కోసం 15 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. కర్మాగారాల సీఎస్సార్(CSR) నిధులతో జరిగిన ఊరచెరువు అభివృద్ధి తప్ప ఇతర పర్యాటక పురోగతి ఇంతవరకు కనిపించలేదు. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో 10వేల మంది వరకు కార్మికులుంటారు. వారి అవసరాలకు ఈఎస్ఐ డిస్పెన్సరీ సరిపోవడం లేదని దానిని ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇంతవరకూ ఈ హామీ నెరవేరలేదు.
ట్రామా కేర్ ఊసే లేదు: జాతీయ రహదారికి అనుసంధానంగా రాష్ట్ర సరిహద్దుల్లో నాలుగు జిల్లాల కూడలిగా ఉండే జగ్గయ్యపేట ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అత్యవసర ట్రామాకేర్ కేంద్రం కోసం 3 కోట్లతో భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. జగ్గయ్యపేట పట్టణం మధ్య నుంచి ప్రవహించే ఎర్రకాల్వ, వేపల వాగులను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసేందుకు 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ప్రణాళిక సిద్ధమైంది. ఆచరణలో మాత్రం విఫమయ్యారు. జగ్గయ్యపేట పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన పాసింజర్ రైలు ఏర్పాటుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దానికీ దిక్కులేదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.
ఇలా ప్రజల సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన ఎన్నో హామీలు మరెన్నో భరోసాలు గాలిలో కలిసిపోయాయి. హామీలపై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. పరిష్కరించే మనసు లేనప్పుడు ఎందుకు హామీలు గుప్పించడమంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.