IT Minister Nara Lokesh in US India Strategic Partnership Forum Summit : ఏపీని తొలి ట్రిలియన్ డాలర్ల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పెట్టుబడిదారులకు వేగంగా చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో నూతన రాజధాని, పోర్టులు, బిగ్‌డేటా సెంటర్స్, పెట్రో, కెమికల్, ఆక్వా, బయోఫ్యూయల్స్, ఫార్మా, మెడికల్ పరికరాలు, ఐటీ, రంగాల్లో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని వెల్లడించారు. 'స్టార్టప్ ఆంధ్ర' నినాదం మాత్రమే కాదన్న లోకేశ్ పాలనా విధానాన్ని మార్చే ఆయుధంగా అభివర్ణించారు.
దిల్లీలో జరిగిన U.S- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్ షిప్ సమ్మిట్‌లో ఐటీ శాఖ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఏపీ పెట్టుబడుల స్వర్గధామమని వివరించిన లోకేశ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సత్వరం అందించనున్న సహాయ సహకారాలను వివరించి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన వారందరినీ కలిపి ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారం వారం అప్‌డేట్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వపరంగా వేగంగా స్పందిస్తున్నామని ఇందుకోసం ఎకనమిక్ డెవలప్‌మెంట్‌బోర్డును పునరుద్ధరించామని గుర్తు చేశారు.
వినూత్న ఆలోచనలు, ప్రయోగాలకు కూటమి ప్రభుత్వం ముందుంటుందన్న లోకేశ్ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో నైపుణ్య గణన మొదలుపెట్టామన్నారు. ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడమేగాక వారి నైపుణ్యాలను అంచనా వేసి మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్న దానిపై దృష్టిపెట్టినట్లు వివరించారు. ఎన్నికల హామీలో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు. విశాఖను డేటా, ఏఐ, ఎంఎల్ కేంద్రంగా మార్చనున్నట్లు లోకేశ్ వివరించారు.
మా ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించింది : లోకేశ్
'విశాఖ నగరం అంత్యంత కీలకంగా మారనుంది. అక్కడ పునరుత్పాదక విద్యుత్‌తోపాటు అద్భుతమైన తీరప్రాంత ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయి. ప్రభుత్వం ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కాకుండా స్పీడ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పైనే ఎక్కువ ఆలోచిస్తోంది. నెలల తరబడి అనుమతులు రాకుంటే పెట్టుబడిదారుల ప్రణాళికలన్నీ తలకిందులవుతాయి.ఈ విషయం మాకు బాగా తెలుసు.అందుకే ఇచ్చిన హామీలను వీలైనంత వేగంగా నెరవేరుస్తాం. విశాఖ ఐటీ, ఫార్మా, కెమికల్, వైద్య పరికరాల తయారీకి కేంద్రంగా ఉంది. ఇక్కడ ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలన్నీ ఉన్నాయి. వీటిలో ప్రపంచ స్థాయిలో శిక్షణ కల్పించి మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం.' - నారా లోకేశ్, మంత్రి
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానాలు ఏపీలో అమల్లోకి తెస్తున్నామన్నారు. ఉత్తమ విద్యా సంస్థలను తీసుకురావడం ద్వారా ఏపీని విజ్ఞాన కేంద్రంగా మార్చనున్నట్లు లోకేశ్ తెలిపారు. ఇటీవల వరదల్లో డ్రోన్లసాయంతో బాధితులకు ఆహారం అందజేశామని గుర్తుచేశారు. రియల్‌టైం గవర్నమెంట్‌కు అతీతంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆన్ యువర్‌ఫోన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇందులో తొలి దశ కింద 100 ప్రభుత్వ సేవలను ఫోన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు.
పరిశ్రమలను రాష్ట్రానికి తెస్తున్నాం - 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతాం: నారా లోకేశ్