Aarogyasri Bills Frauds in AP 2024 : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఆర్యోగ్యశ్రీ ట్రస్టు నిర్వీర్యమైంది. జగన్ అధికారంలోనికి వచ్చిన వెంటనే జేఈఓ ఆపరేషన్స్ హెడ్‌గా పార్టీ నేత సమీప బంధువు నియమితులయ్యారు. ఇటీవలే ఆయన్ని సాగనంపారు. ఆయన హయాంలోనే అనుబంధ ఆసుపత్రులకు చికిత్స అనుమతుల్లో భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగింది. గుంటూరు, విశాఖ, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ఆసుపత్రుల్లో ఒకేరకమైన ట్రీట్‌మెంట్ క్లెయిమ్స్ అసాధారణ స్థాయిలో జరిగాయి. కానీ ఏ దశలోనూ ట్రస్టు ప్రధాన కార్యాలయంలో దీనిపై పరిశీలన జరగలేదు.
భారీ ఎత్తున గోల్‌మాల్ : రోగులకు చికిత్స అందించే ముందు ఆసుపత్రుల వారు ట్రస్టు నుంచి ముందస్తు అనుమతులు పొందుతారు. వీటికి అనుగుణంగా చికిత్స అందించి కేసు షీట్లు, వ్యాధి నిర్థారణ పరీక్షల ఫలితాల ఆధారాలతో కలిపి బిల్లులు పెడతారు. ప్యానల్ డాక్టర్లు వీటిని పరిశీలించి చెల్లింపు మొత్తాని మంజూరు చేస్తారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా ట్రస్టు అధికారులు ఆస్పత్రులకు చెల్లింపులు చేస్తారు. అయితే అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రులకు చెల్లింపులు విషయంలో ఏ దశలోనూ సమస్య ఎదురుకాలేదు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగింది. జబ్బురాకున్నా వచ్చినట్లు ట్రస్టు నుంచి బిల్లులు పొందిన ఆసుపత్రులు చాలానే ఉన్నాయి.
CID Inquiry on Aarogyasri Scam : డెంటల్ ట్రీట్‌మెంట్ బిల్లుల చెల్లింపుల్లోనూ భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగింది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2019-24 మధ్య రూ.300 కోట్ల వరకు డెంటల్ ట్రీట్‌మెంట్ కింద ఆసుపత్రులకు చెల్లింపులు జరిగాయి. ప్యానల్ డాక్టర్ తక్కువ మొత్తం చెల్లింపు కోసం సిఫార్సు చేస్తే ట్రస్టు డాక్టర్ తన విశేషాధికారాలు ఉపయోగించి అధికంగా చెల్లించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.20 కోట్ల వరకు అదనంగా చెల్లింపులు జరిగినట్లు కొన్ని కేసుల పరిశీలనలో తేలింది.
ఈ గోల్‌మాల్‌కు సంబంధించి ట్రస్టు కార్యాలయంలో పనిచేసే నలుగురిపై క్రమశిక్షణ చర్యలు మొదలయ్యాయి. ఆడిటింగ్ విభాగంలో పనిచేసే ఒకరు దళారిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అనుబంధ ఆసుపత్రి అక్రమాలపై ఇప్పటికే సీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కొందరు మాజీ ఉద్యోగులు అనుబంధ ఆసపత్రులతో బేర సారాలకు దిగినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల తనిఖీల ద్వారా అక్రమాలకు పాల్పడ్డ ఆసుపత్రులపైనా క్రిమినల్ కేసులు పెట్టబోతున్నారు. మరోవైపు ఆయా జిల్లాల్లోని ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించే కీలక పదవులైన సమన్వయకర్తలుగా అప్పట్లో వైఎస్సార్సీపీ నాయకులతో సత్సంబంధాలున్నవారే ఎంపికయ్యారు. ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటికీ దాదాపు అందరూ కొనసాగుతున్నారు.
నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ - చేతులెత్తేసిన ప్రైవేటు ఆస్పత్రులు
ఆరోగ్యశ్రీపై ప్రచారం ఘనం - బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం