Fight For BJP Telangana State President Post : రాష్ట్రంలో బీజేపీ ఒక వైపు బలపడుతుంటే, అంతే స్థాయిలో నేతల మధ్య విభేదాలు తలనొప్పిగా మారుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్న కమలదళం, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 36శాతం ఓట్లతో అధికార పార్టీకి ధీటుగా, 8 ఎంపీలను గెలుచుకుంది. ఇదే ఊపుతో, వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం సాధించాలనే లక్ష్యంతో సాగుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం నేతల మధ్య అంతర్గత వార్ మొదలైంది.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టడడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇంకొకరికి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. బీజేపీలోనూ ఒకే వ్యక్తికి ఒక పదవి అనే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడి నియామకం తప్పని పరిస్థితి. కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, అంతర్గత పోరు మాత్రం ముదురుతోంది. పాత వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొందరు అంటుంటే మేము అర్హులం కాదా? అని కొత్త వాళ్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
పార్టీలోని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, దేశం కోసం ధర్మం కోసం పని చేసే, దూకుడు స్వభావం కలిగిన వ్యక్తికే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న ఈటల రాజేందర్, నేరుగా రాజాసింగ్ పేరు ప్రస్తావించడనే కుండా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ చేశారు.
Etela On Telangana BJP State Chief Post : ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లడానని, ఫైటర్ అంటే స్ట్రీట్ ఫైటర్ కావాలా? అంటూ రాజాసింగ్ వ్యాఖ్యల్ని ఈటల తిప్పికొట్టారు. ఏనుగు కుంభస్థలం కొట్టే సత్తా తమకు ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన తర్వాత కొత్త పాత అంటూ ఉండదని హిమంత బిస్వశర్మ అసోం ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు కావొచ్చని రాష్ట్ర సారథిపగ్గాలను ఆశిస్తున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వాస్తవానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ కాషాయతీర్థం పుచ్చుకున్నప్పటీ నుంచే పార్టీలో కొత్త, పాత పంచాయితీ నడుస్తోంది. అధిష్ఠానం సైతం దిల్లీకి పిలిపించుకుని విభేదాలు పక్కన పెట్టి పని చేయాలని చురకలు అంటించింది. విభేదాలు తగ్గకపోగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే స్థాయికి తీసుకువచ్చింది. అనూహ్యంగా అందరికీ అమోదయోగ్యంగా ఉండే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది.
ఒక వైపు కేంద్రమంత్రిగా, మరో వైపు రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఆశించిన ఫలితాలు సాధించకపోయినా మంచి, ఓట్లు సాధించి రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. పార్టీ పుంజుకున్న తరుణంలో ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అధ్యక్ష పదవి పేరుతో పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు.
'కిషన్ రెడ్డి అనే నేను' - తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎంపీలు