Interesting Conversation between AP CM Chandrababu and Lokesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ రాష్ట్ర మంత్రి లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు గుంటూరు జిల్లా పెనుమాక నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా గతంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు ప్రజల సీఎంను చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైమ్ పడుతుందనుకుంటా సార్, ఇంకా పరదాలు కడుతున్నారని చంద్రబాబుకు వివరించారు.
దీనికి చంద్రబాబు బదులిస్తూ 'లేదు సెట్ అయ్యారు' అని చెప్పారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని, బతిమిలాడి తీయిస్తున్నామని లోకేశ్ వివవరించారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
పాత రోజులు మరచిపోవాలి : ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోవాలని చంద్రబాబు సూచించారు. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నామని చెప్పారు. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదని అన్నారు. ఆ ఆలోచనే రాకూడదని వివరించారు. అలా ఉండకపోతే ఒక్క షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారని పేర్కొన్నారు. దానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రారంభం కదా అందుకే స్లోగా వెళ్తున్నానని, ఇక స్పీడ్ పెంచాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పారు. 'చరిత్ర గుర్తు పెట్టుకోవాలని, నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివని, నీకు కూడా ఐడియా లేదని' లోకేశ్‌కు వివరించారు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు అంతలా ఉండదు కానీ, తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో సభలో నవ్వులు పూశాయి.
"రివర్స్ గేర్ పాలన నుంచి అంతా ఫ్రంట్ గేర్‌లోకి రావాలి. పరిపాలనలో ఇక రివర్స్ గేర్లు ఉండవు. రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఇక దూసుకుపోవటమే. రాజధానిలో భాగమైన మంగళగిరిలో అభివృద్ధిని పరుగులెత్తిస్తామని హామీ ఇస్తున్నాను. గతంలో సీడ్ యాక్సిస్ రహదారి విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించలేదు. ఈసారి ఎవ్వరూ అడ్డుపడకుండా రహదారి పూర్తికి అంతా ముందుకు రావాలి." - చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి