Ratan Tata hobbies : తూర్పు గోదావరి జిల్లా కడియపు లంక నర్సరీలకు పెట్టింది పేరు. ఇక్కడి మొక్కలు దేశ వ్యాప్తంగా ఎగుమతి కావడం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటాకు కడియపు లంక నర్సరీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడి మొక్కలను ఆయన తన గ్రూపునకు చెందిన కార్యాలయాల్లో నాటించడంతో పాటు పాటు.. తన నివాసంలోనూ విరివిగా ఏర్పాటు చేసుకున్నారు. బేరింగ్‌టోనియా మొక్కంటే రతన్ టాటాకు బాగా ఇష్టమని కడియం నర్సరీల రైతులు తెలిపారు. ఇక్కడి నర్సరీ రైతు మార్గాని వీరబాబుకు 2023 జనవరిలో కుటుంబంతో సహా వెళ్లి రతన్‌టాటాను ఆయన నివాసంలో కలుసుకునే అవకాశం దక్కింది.
తాము కలిసి మాట్లాడటానికి గంట అనుమతి కోరగా ఆ మేరకు రతన్ టాటా అనుమతించారట. అయితే, వీరబాబు ప్రయాణించే విమానం ల్యాండింగ్ సమస్యతో రెండున్నర గంటలు ఆలస్యం కావడంతో ఇక ఆ అవకాశం దక్కదేమో అనుకున్నారట. విమానం ఆలస్యమైందన్న విషయం తెలుసుకున్న రతన్ టాటా.. తన కోసం ఎంతో ప్రయాసపడి వస్తున్న వారి ఇబ్బందిని తెలుసుకుని మరో గంట సమయాన్ని వీరబాబు కుటుంబం కోసం కేటాయించారట. అంతేకాదు మొక్కల పెంపకం, వాటి పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నర్సరీ విషయాలన్నీ స్వయంగా అడిగి తెలుసుకున్నారట. కడియం నర్సరీల్లో బేరింగ్‌టోనియా మొక్కపై తన ఆసక్తి, ఇష్టాన్ని రతన్ టాటా వారికి వివరించారట. అంతటి గొప్ప వ్యక్తి మృతి ప్రపంచానికి తీరని లోటు అని వీరబాబు, ఆయన కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
మార్గాని వెంకటశేషుతోనూ ప్రత్యేక మైత్రి
నర్సరీ రైతు మార్గాని వీరబాబు కుమారుడు వెంకట శేషుకు రతన్ టాటాతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా పర్యావరణ, ప్రకృతి, పశు పక్ష్యాదులకు సంబంధించిన అంశాలతో కొన్ని వెంకట శేషు కొటేషన్లు తయారు చేసి టాటా వ్యక్తిగత ఈమెయిల్‌కు 2017 నుంచి పంపిస్తుండేవారట. వాటిల్లో కొన్ని నచ్చడంతో రతన్‌టాటా తిరిగి జవాబు ఇచ్చేవారట. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మైత్రి మొదలైందని తెలుస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా తల్లిదండ్రులతో వెళ్లి టాటాను కలిసిన మార్గాని శేషు తాను గీసిన చిత్రాలను బహూకరించారట. మొత్తం మూడుసార్లు రతన్‌టాటాను కలిసే అదృష్టం తనకు కలిగిందని తెలిపిన శేషు.. తాను బహూకరించిన చిత్రాన్ని తదేకంగా చూసి సంతోషపడ్డారని ఈటీవీ భారత్‌కు తెలిపారు. చిత్రాన్ని గీయడానికి ప్రేరణ ఏమిటనే విషయం స్వయంగా టాటా గారు తనను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రతన్ టాటాకు డ్రైఫ్రూట్ లడ్డూలంటే చాలా ఇష్టమని చెప్తూ.. తానూ పలు సందర్భాల్లో ఆయనకు లడ్డూలు పంపించినట్లు వివరించారు. ఈ ఏడాది జనవరిలో తాను కలిసినప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యానికి గురవడంతో కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడానని తెలిపారు. రతన్ టాటా లేని లోటు తీరదని బాధ వ్యక్తం చేశారు.
శ్రీవారి భక్తులకు రతన్ టాటా విలువైన కానుక - ఏటా 12కోట్ల పైమాటే! - ఏమిటో తెలుసా?
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
టాటా పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు - NCPA గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున జనం