Implementation Of CAA Started : ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం-2019 సీఏఏ అమలు భారతీయ జనతా పార్టీ అజెండాలోని కీలక అంశాలివి. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలన్న బీజేపీ కల నెరవేరగా, ఉమ్మడి పౌరస్మృతి ప్రక్రియ కసరత్తు దశలో ఉంది. మిగిలింది పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ దాన్ని కూడా అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఓ వైపు దేశమంతా లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతుండగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి తొలివిడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.
Citizenship Certificates were Handed Over : ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ నెల 15న 14 మందికి సీఏఏ కింద జారీ అయిన పౌరసత్వ ధ్రువీకరణపత్రాలు అందజేశారు. వందల మందికి డిజిటల్ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రాలను ఈ-మెయిల్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా భారత పౌరసత్వం కల్పించేలా కేంద్రం నిబంధనలను రూపొందించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఏఏ అమలు గురించి కేంద్రం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది.
పలు కారణాలతో 5ఏళ్లు అమలుకు నోచుకోని చట్టం : వాస్తవానికి 2019 డిసెంబర్‌లోనే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన సీఏఏ విపక్షాల వ్యతిరేకత, కరోనా వంటి కారణాలతో ఇన్నాళ్లూ అమలు కాకుండా ఆగుతూ వచ్చింది. అయిదేళ్లుగా ఆగిన ఈ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతుండగానే అమలు చేసిన కేంద్రం ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకుంది. అయితే దీన్ని విపక్షాలు అధికారంలో ఉన్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోమని తేల్చిచెబుతున్నాయి.
కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడం సహా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించింది కూడా. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, దిల్లీ, పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉన్నాయి. ఆయా పార్టీలన్నీ సీఏఏ పేరు చెబితేనే మండి పడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం దీని అమలు ప్రక్రియను ప్రారంభించినా రాబోయే రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో అమలు అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
Purpose of Citizenship Amendment Act : పౌరసత్వ సవరణ చట్టం 3 ముస్లిం దేశాలకు చెందిన 6 మతాల వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన హింసకు గురై భారత్‌కు 2014 డిసెంబర్ 31కు ముందు తరలివచ్చిన ఆయా దేశాల్లోని మైనార్టీలైన హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధులకు ఇక్కడి పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ చట్టం తీసుకువచ్చారు. 2019 డిసెంబర్‌లోనే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు అప్పటి రాష్ట్రపతి కూడా పచ్చజెండా ఊపడంతో చట్టంగా మారింది.
ఆ ప్రాంతాలకు వర్తించదు : రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 కిందకు వచ్చే ఈశాన్యరాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. అయితే చట్టంలో పేర్కొన్న మతాల జాబితాలో ముస్లింలు లేకపోవడం సహా ఇది ఆ వర్గం హక్కులను హరించేదిగా ఉందని అనేక విపక్షాలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామ పక్షాలు, అప్పటి టీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సీఏఏకు వ్యతిరేకంగా 2020 ఆరంభంలో దేశ రాజధాని దిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో తీవ్ర హింస చెలరేగి 80మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది.
భారత పౌరులతో సమానంగా అధికారాలు : సీఏఏ అమలు ప్రారంభమైన నేపథ్యంలో 3 దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థులు భారత పౌరులతో సమానంగా అధికారాలు, హక్కులు పొందనున్నారు. సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి లేదా వలస వచ్చిన వారికి తాము నివసిస్తున్న ప్రాంతాల్లో వివక్ష సహజంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు అంటే ఆ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
విద్య, ఉద్యోగం, వేతనాలు సహా ఇతర హక్కులు భారత పౌరులకు దక్కినంతగా దక్కవు. వలస జీవులు కూడ దేశం కాని దేశంలో సరిగా ఇమడలేకపోవడం, ఇక్కడి వారితో కలిసి పోలేకపోవడం, తాము పరాయి వారం అనే న్యూనతతో లేదా భయంతో బతుకులు వెళ్లదీస్తూ ఉంటారు. సీఏఏ అమలు ద్వారా ఇప్పుడు అవన్నీ దూరం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందుకున్న తర్వాత వలస జీవులు ఇది తల్చుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
పౌరసత్వం కోసం 25 వేల దరఖాస్తులు : పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధుల సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదు. అయితే వీరిలో భారత పౌరసత్వం కోసం 25వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు గత వారం హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆయా దేశస్థులకు పౌరసత్వం కల్పించిన రోజును ఆయన చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. అటు సీఏఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించనున్నాయనే ఉత్కంఠ నెలకొంది.
లోక్‌సభ ఎన్నికల వేళ : సరిగ్గా లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ కేంద్రం దీని అమలు ప్రారంభించగా ప్రస్తుతమైతే అధికార, విపక్ష పార్టీల ప్రచారంలో ఈ అంశం అంతగా వినిపించడం లేదు. విపక్షాలు మాత్రం దీనిపై ఇప్పటికే పలు విమర్శలు చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు విపక్ష నేతలు సీఏఏను ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. దేశంలో మత హింసను ప్రోత్సహిస్తుందని విమర్శించాయి. కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని రద్దు చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. మరి నిజంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దీని అమలు సంగతి ఏమిటనే చర్చ సాగుతోంది.
CAA అమలుతో ఏమవుతుంది? కొత్త చట్టంపై నిరసనలకు కారణమేంటి?
నరేంద్ర మోదీ నేతృత్వంలో 2019లో రెండో సారి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జరిపి ఈ ఏడాది జనవరిలో బాల రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తి చేసింది. 500 ఏళ్ల నాటి కలను నెరవేర్చామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటోంది బీజేపీ. ఇప్పుడు సీఏఏను అమలులోకి తీసుకువచ్చింది.
ఓ రకంగా బీజేపీ తమ సైద్ధాంతిక ఎజెండాలోని అంశాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వచ్చింది. ప్రజల భావోద్వేగంతో ముడిపడి, వివాదాస్పదంగా ఉన్నా ఆయా అంశాలను అమలులోకి తెచ్చి తమ పంతం నెగ్గించుకుంది. అయితే సీఏఏను విపక్షాలు వ్యతిరేకించడం, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని దాని నేతలు ప్రకటించిన నేపథ్యంలో దీని భవిష్యత్తు ఏమిటనే ఉత్కంఠ నెలకొంది. మరి లోక్‌సభ ఎన్నికల ఫలితాల సరళిని బట్టే ఇది తేలనుంది.
CAAను ఎప్పటికీ వెనక్కి తీసుకోం- ఆ విషయంలో ప్రతిపక్షాలవన్నీ అబద్ధాలే : అమిత్ షా