IMD Issued Yellow Warning to Telangana : రాష్ట్రానికి హైదారాబాద్ వాతావరణ శాఖ మూడు రోజుల వర్షసూచన చేసింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదారాబాద్, మహబూబ్‌నగర్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉమ్మడి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదారాబాద్, మహబూబ్ నగర్‌తో పాటు అదిలాబాద్, నిర్మల్, జనగాం, సిద్దిపేట జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
భాగ్యనగరంలో దంచికొట్టిన వాన : ఇవాళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్, బాగ్ లింగంపల్లి, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీ నగర్, జవహర్ నగర్, కవాడిగూడ, దోమలగూడ తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి బయలు దేరిన ఉద్యోగులు, విద్యార్థులు వర్షానికి తడిచిపోయారు.
మరోవైపు హైదరాబాద్‌కు ఎల్లో హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు రోడ్లను క్లియర్ చేయాలని, అనుక్షణం అప్రమత్తతతో ఉండాలని స్పష్టం చేశారు. నగరంలో బల్దియా యంత్రాంగమంతా వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.