Heavy Rain Alert to Telangana : వానల సుడిగుండంలో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధ ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు. శుక్రవారం నాడు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.
Telangana Weather Report : పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత అల్పపీడనంతో పోలీస్తే దీని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు : సెప్టెంబర్ మాసంలో గత పదేళ్లలో ఈ ఏడాదే అత్యంత వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారిణి శ్రావణి తెలిపారు. శీతోష్ణస్థితి పరిస్థితుల్లో చాలు మార్పులు కనిపిస్తున్నాయన్నారు. ఒకేసారి అధిక వర్షపాతం నమోదవ్వడం, సుదీర్ఘ విరామం వంటి పరిస్థితులు శీతోష్ణస్థితి వల్ల ఏర్పడుతున్నట్లు తెలిపారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో వరదలకు రెండు కారణాలు ఉన్నాయని ప్రముఖ పర్యావరణవేత్త దొంతి నరసింహా రెడ్డి తెలిపారు.
కాలుష్య ఉద్గారాల వల్ల పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల కాలుష్యం ఏర్పడి భూమి ఉష్ణోగ్రత పెరిగి వాతావరణ మార్పులు ఏర్పడుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, కుంభవృష్టి వర్షాలు కనిపిస్తున్నాయని చెప్పారు. స్థానిక పరిస్థితులు కూడా ఇందుకు కారణమన్నారు. ప్రకృతి విధ్వంసం, చెరువులు, కుంటలు, వాగులు అక్రమణకుగురై మేటవేయడం, వైశాల్యం తగ్గిపోవడం వల్ల పడిన వర్షం చాలా వేగంగా ప్రవహించి వరదలు సంభవిస్తున్నట్లు చెప్పారు.
పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు - అతలాకుతలమైన రైతుల పరిస్థితి - Floods Damage in Telangana