IIIT Hyderabad Top IN Annual Salary : క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వార్షిక వేతన ప్యాకేజీలో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ తన హవాను కొనసాగిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరంలోనూ ఐఐటీలను తలదన్ని అగ్రస్థానంలో నిలిచింది. ట్రిపుల్‌ఐటీలో మధ్యగత(మీడియన్) వేతనం ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్, దిల్లీ, బాంబే కంటే చాలా అధికంగా ఉండటం విశేషం. ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్ విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మధ్యగత వార్షిక వేతనం అత్యధికంగా రూ.24 లక్షలు ఉంది. గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలో అది ఏకంగా రూ.30.30 లక్షలు ఉండటం గమనార్హం.
కేంద్ర విద్యాశాఖ తాజాగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. అందులో క్యాంపస్ ప్లేస్మెంట్లకు ఎంపికైన వారి సంఖ్య, ఉన్నత విద్యకు వెళ్లిన వారు, వేతన ప్యాకేజీ తదితర వివరాలను పొందుపర్చింది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 1,463 కళాశాలలు పోటీపడగా వాటిల్లో టాప్-100 కళాశాలలను కేంద్రం ప్రకటించింది. వాటిల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లలో వార్షిక మధ్యగత వేతనాలను ‘ఈనాడు- ఈటీవీ భారత్’ పరిశీలించింది.
ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటి : గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలో నాలుగేళ్ల బీటెక్‌లో 154 మంది ఉత్తీర్ణులవగా 140 మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు ఎంపికయ్యారు. వారిలో 70 మంది ఏడాది శాలరీ రూ.30.30 లక్షలకు మించి ఉంది. మిగిలిన 14 మంది ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లారు. 2015-16లో ఈ విద్యా సంస్థ మధ్యగత వార్షిక వేతనం రూ.16 లక్షలు మాత్రమే. ఈ విద్యా సంస్థలో సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచీలు మాత్రమే ఉండటంతో ప్రాంగణ నియామకాల్లో కలిసి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్ రూ.24 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. అందులో 580 మంది ఉత్తీర్ణులవ్వగా 460 మంది ప్లేస్మెంట్లు దక్కించుకున్నారు. 40 మంది ఉన్నత విద్యలో ప్రవేశించారు. మిగిలిన 80 మంది పరిస్థితి ఏమిటన్నది నివేదికలో తెలియపరచలేదు.
అసలేంటీ మధ్యగత వార్షిక వేతనం : విద్యాసంస్థలు సాధారణంగా సగటు/సరాసరి వార్షిక వేతనాన్ని ప్రకటిస్తుంటాయి. వంద మందికి ఉద్యోగాలు దక్కితే వారికి ఆఫర్ చేసిన మొత్తం వార్షిక వేతనాన్ని కూడి, 100తో భాగించగా వచ్చేదే సగటు వేతనం. ఈ విధానంలో లోపాలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఉదాహరణకు ఒక కళాశాలలో ఒకరికి ఏడాదికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.10 లక్షల జీతం దక్కిందనుకుంటే విద్యాసంస్థ సగటు వేతనం రూ.25 లక్షలు అవుతుంది.
అంటే అత్యధిక, అత్యల్పం మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇది నిజమైన వేతన పరిస్థితిని ప్రతిబింబించదని నిపుణుల మాట. అందుకే ఒక కళాశాలలో ఉద్యోగాలు పొందిన మొత్తం విద్యార్థుల్లో మధ్యలో ఉన్న విద్యార్థి పొందిన జీతాన్ని మధ్యగత వేతనంగా లెక్కకడుతున్నారు. ఉదాహరణకు ఐదుగురు విద్యార్థులు వరుసగా రూ.50 లక్షలు, రూ.20 లక్షలు, రూ.18 లక్షలు, రూ.15 లక్షలు, రూ.5 లక్షల వేతనాలతో ఎంపికయ్యారనుకుంటే అప్పుడు రూ.18 లక్షలను మధ్యగతంగా(మీడియన్) పరిగణిస్తారు. అంటే జాబ్లకు ఎంపికైన వారిలో సగం మంది వేతనం రూ.18 లక్షలకుపైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ఆరుగురు విద్యార్థులును పరిగణనలోకి తీసుకుంటే 3, 4వ స్థానాల్లో ఉన్న వారి వేతనాల సగటును మధ్యగతంగా నిర్ణయిస్తారు.
IIT Hyderabad : 'ఓపెన్ టు ఆల్ టీచింగ్'తో.. అందరికీ ఐఐటీ విద్య
పరిశోధనలపై ఆసక్తి ఉందా.. అయితే ఐఐటీ హైదరాబాద్ 'ఫ్యూచర్ ఇన్నోవేటర్స్' మీకోసమే..