Aged People on Health : ‘ఉద్యోగ విరమణ పొందాం. ఇంకేముంది? కృష్ణా రామా అనుకుంటూ హాయిగా విశ్రాంతి తీసుకుందాం. ఈ వయసులో శారీరక శ్రమ అవసరమా?’ అరవై ఏళ్లు దాటిన చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు. ఉద్యోగ విరమణ పొంది, వయసు పైబడి పనులకు విరామమిచ్చినవారు ఆర్థిక భద్రత గురించి బాగానే ఆలోచిస్తుంటారు. ఆరోగ్యాన్ని మాత్రం అంతగా పట్టించుకోరు.
వాస్తవానికి ఆర్థిక భద్రత కన్నా ఎక్కవ శాతం ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యమివ్వాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఏజ్ పెరిగే కొద్ది పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు, వ్యాయామాలతో కలిగే ప్రయోజనాలపై ఖమ్మంలో జనరల్ మెడిసిన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ వేము గంగరాజు సూచనలు, సలహాలు.
మితంగా తినడమే మిన్న: వయసు పెరుగుతున్న కొద్దీ జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అజీర్ణం, పుల్లటి తేన్పుల, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల వయసుకు తగ్గట్టుగా ఆహారంలో నిత్యం మార్పులు చేసుకోవాలి. సమతుల ఆహారమే నాణ్యంగా తినాలి. ఉప్పు, చక్కెర, తీపిపదార్థాలు తగ్గించాలి. తినే ఆహారంలో 50 శాతం వరకు ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఉండాలా చూసుకోవాలి. మాంసకృత్తులూ ముఖ్యమే. నూనె, వేపుళ్లు, పిండిపదార్థాలు తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి.
క్రమం తప్పకుండా బ్లెడ్ ప్రెజర్, గ్లూకోజు, కొలెస్ట్రాల్ వంటి సాధారణ వైద్యపరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారు మందులు, ఆహార, వ్యాయామ నియమాలతో గ్లూకోజు అదుపులో ఉండేలా చూసుకోవాలి. మందులు వేసుకొని, ఆహారం తీసుకోకుండా నడిస్తే ఒక్కోసారి గ్లూకోజు మోతాదులు పడిపోవచ్చు. జామ, బొప్పాయి వంటి పండ్లు తీసుకోవాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఆరుబయట కాకుండా ఇంట్లోనే నడవటం మేలు. ఉదయం 8 గంటల తర్వాత నడక ప్రారంభించాలి. మరీ చల్లగా ఉన్నప్పుడు మాత్రం నడవొద్దు.
వ్యాయామమే ఆరోగ్యానికి శ్రేయస్కరం : విశ్రాంత సమయంలో ఆరోగ్యంపై చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాయామం, ధ్యానం, యోగా వంటి వాటిపై దృష్టి సారించాలి. వ్యాయామాల్లో నడక తేలికైంది. నడకతో శరీరం దృఢంగా తయారవడంతో పాటుగా మానసిక ఆరోగ్యమూ మెరుగవుతుంది. వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఉల్లాసం, హాయి భావన కలుగుతుంది. అందువల్ల రోజుకు కనీసం 30 నిమిషాలు నడిస్తే మంచిది. వ్యాయామాలకు ముందు శరీరాన్ని వార్మప్ చేయటం ముఖ్యం. తద్వారా బిగుసుకున్న కండరాలు, కీళ్లు ఫ్రీగా కదులుతాయి.
గాయాల బారినపడే అవకాశం తగ్గుతుంది. వ్యాయామం చేసేటప్పుడు నూలు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. నడక కోసం ప్రత్యేకించిన ట్రాక్స్‌లో నడవటం మంచిది. నేల చదునుగా ఉన్నచోట నడిస్తే మోకాళ్ల నొప్పులు తలెత్తకుండా ఉంటాయి. వ్యాయామం ప్రారంభించే ముందు, అనంతరం నీళ్లు తాగడం మర్చిపోవద్దు. హృద్రోగులు వ్యాయామాలను ఆరంభించటానికి ముందు గుండె సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో గుండె రక్తం పంపింగ్ సామర్థ్యం (ఏఎఫ్) 60% ఉండాలి. గుండెజబ్బులతో బాధపడే కొందరిలో ఇది 30 శాతం ఉండొచ్చు. అంటే హర్ట్ అంత సమర్థంగా పంప్ చేయటం లేదని అర్థం. వీరికి నడక అంత మంచిది కాదు.
మానసిక ఉల్లాసమూ ప్రధానమే : జీవిత చరమాంకంలో మానసికోల్లాసం కూడా ముఖ్యమే. వయసు పెరుగుతున్నకొద్దీ ఒంటరితనం ఆవహిస్తుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. రకరకాల ఒత్తిళ్లతో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం ఉపయోగపడతాయి. అవసరమైతే వైద్యుల సలహాల మేరకు మందులూ వేసుకోవాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులతో సమయాన్ని ఉత్సాహంగా గడపాలి. సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. ఫ్రెండ్స్‌తో క్లబ్బులు ఏర్పాటు చేసుకోవాలి. మనసుకు ఇష్టమైన పుస్తకాలు చదవటం, సంగీతం వినడం, ఇతరులతో చర్చించటం, సినిమాలు చూడటం, చిన్నపిల్లలతో ఆడుకోవటం వంటి అలవాట్లను కొనసాగించాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మెదడుకు మంచి ప్రేరణ కలుగుతుంది. క్రమపద్ధతిలో రోజువారీ పనులు చేసుకోవటం మంచిది. ఎదుటివారితో అనుభవాలు, భావోద్వేగాలను పంచుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
60 ఏళ్లపైబడిన వారు
ఖమ్మం: 1.66 లక్షలు
భద్రాద్రి : 1.54 లక్షలు
బీఆర్ఎస్ చేసిన కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపు టపాసులా పేలుతుంది : పొంగులేటి