IAS Transfers in Andhra pradesh: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో మొత్తం 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌లను సాధారణ పరిపాలన శాఖకు (General Administration Department) అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌ను నియమించగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.
వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించగా, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్‌ను నియమించగా, పుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది.
కోన శశిధర్‌ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించడంతో పాటు ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ ను నియమించింది. ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను నియమించింది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నకు బాధ్యతలు అప్పగించింది.
ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకిని నియమించింది. పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్‌కు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను గనుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించడంతో పాటు ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తిరుపతి జాయింట్ కలెక్టర్‌కు జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్ప్ సీఈవో మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జలవనరులశాఖ సలహాదారుగా విశ్రాంత చీఫ్ ఇంజినీర్: మరోవైపు జలవనరులశాఖ సలహాదారుగా విశ్రాంత చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు సలహాదారు పదవిలో వెంకటేశ్వరరావు కొనసాగనున్నారు.