Early Sankranti celebrations 2025 in AP : సంక్రాంతి ముందస్తు సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రంగవల్లుల పోటీలు, సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న పదహారణాల తెలుగింటి ఆడపిల్లల సందడి మధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. యువత ఆటపాటలతో అలరిస్తున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎస్.వీ.ఎల్ క్రాంతి విద్యాసంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సందడి అంబరాన్ని అంటింది. విద్యాసంస్థ ఆవరణలో పొట్టేలు, కోడి పుంజుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. కర్రసాము ప్రదర్శన, ముగ్గుల పోటీలు జరిగాయి. భోగి మంటల చుట్టూ విద్యార్థినులు నృత్యాలు చేసి అలరించారు. గుంటూరు జిల్లా వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు వసుంధర కుటంబం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కంకిపాడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి.
సరదాల సంక్రాంతి - అలరిస్తున్న రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు
సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలిపేలా గుంటూరు జిల్లా కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు పిండి వంటలు చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. విజయవాడలోని PVP సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో సాంప్రదాయ వస్త్రాల్లో విద్యార్థులు సందడి చేశారు. భోగిమంటలు, గంగిరెద్దుల ఆటలు, బొమ్మల కొలువులు, డ్యాన్స్ లతో అలరించారు. విజయవాడలో ఓ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు నిర్వహించారు. అందమైన ముగ్గులు వేసినవారికి బహుమతులు అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి.ఇంపల్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో పండుగ సాంప్రదాయాలు వెల్లివిరిసేలా చేశారు. కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేశారు.
కనుమ అంటేనే కోనసీమ - ప్రభల తీర్థంపై ప్రధాని మోదీ లేఖ
ఈనాడు ఆధ్వర్యంలో విశాఖలోని బుల్లయ్య కళాశాల మైదానంలో జరిగిన ముగ్గుల పోటీలు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాగాయి. పెద్ద సంఖ్యలో యువతులు ఈ పోటీలలో తమ ప్రతిభను కనబర్చారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, విద్యా సంస్థల్లో ముందుగానే వేడుకలు చేపట్టారు. భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు. ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో బాపు బొమ్మలు - ముత్యాల ముగ్గులు పేరిట విజయనగరంలో జిల్లాస్థాయి రంగువల్లుల పోటీలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా విద్యార్ధినులు రంగులతో ముగ్గులు తీర్చిదిద్దారు.