80 Year Old Swimming Sensation in Vijayawada : ఆరు పదుల వయసు దాటితే చాలామంది నడవడానికే కష్ట పడుతుంటారు. కాళ్లు, నడుము నొప్పులతో నిల్చోడానికే ఇబ్బంది పడతారు. కానీ వీళ్లు మాత్రం చాలా ప్రత్యేకం. ఎనిమిది పదుల వయసులోనూ కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా ఈదేస్తున్నారు. కృష్ణా నదిని అలవోకగా దాటేసి ఆశ్చర్యపరుస్తున్నారు. సముద్రాల్లోనూ చేపల్లా దూసుకుపోతూ ఔరా అనిపిస్తున్నారు.
విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో ఉన్న ఆక్వాడెవిల్స్ క్లబ్‌లో 80 ఏళ్లకు పైగా వయసున్న వారు 10 మంది వరకు ఉన్నారు. వీరిలో మహిళలూ ఉన్నారు. జీవితంలో ఎంత సంపాదించినా ఆరోగ్యం లేనిదే దానిని అనుభవించలేమని అందుకే ఆరోగ్యం కోసం రోజూ కాస్త కష్టపడాలని యువతకు సందేశమిస్తున్నారు వీరు. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలని : 'మాది హైదరాబాద్. ఎంఎల్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్‌ని. మా కళాశాలలోని విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలని గతంలో రన్నింగ్ చేసేవాడిని. అనంతరం కాళ్ల నొప్పులు ఎక్కువవ్వడంతో వైద్యులు సైక్లింగ్‌గానీ, స్విమ్మింగ్‌గానీ చేయాలని సూచించారు. దీంతో సైక్లింగ్ చేశా. 2015లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బీఎస్‌ఎఫ్ వాళ్లతో కలిసి సైక్లింగ్‌లో పాల్గొన్నా. అనంతరం 75 ఏళ్ల వయసులో ఈతలోకి వచ్చా. ప్రస్తుతం నా వయసు 80 సంవత్సరాలు.
ఇప్పటికే కృష్ణా నదిని నాలుగు సార్లు ఈదా. గత జనవరిలో జరిగిన కృష్ణా నది క్రాసింగ్ పోటీలో ఈదగలనా అని కాస్త సందేహించా. కాని మిత్రుల భరోసాతో పోటీలోకి దిగి, 40 నిమిషాల్లో పూర్తి చేశా. ఈతలో సుమారు 30 మెడల్స్ సాధించా. రోజూ ఉదయం 5 గంటలకే లేచి యోగా, వాకింగ్‌తో పాటు 40 నిమిషాలు నిర్విరామంగా ఈదుతా. మా కళాశాల విద్యార్థులకు కూడా ఏదో ఒక క్రీడలో రాణించాలని సూచిస్తుంటా.' -మర్రి లక్ష్మారెడ్డి
కృష్ణా నదిని 9 సార్లు ఈదారు : విజయవాడకు చెందిన పొట్లూరి జనార్దనమూర్తి వయసు 87. సోనోవిజన్ వ్యవస్థాపకులు. మామూలుగా అయితే ఆయన వ్యాపారవేత్తగా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడాయన మరోరకంగా కూడా స్ఫూర్తిప్రదాయకంగా నిలుస్తున్నారు. ఆరోగ్యం కోసం మొదలుపెట్టి ఇప్పుడు ఈతలో అద్భుతాలు చేస్తున్నారాయన! గతంలో వాకింగ్, సైక్లింగ్ చేసేవారు. వయసుకు తగినట్టు వ్యాయామాన్ని కూడా మార్చుకోవాలనే ఉద్దేశంతో స్విమ్మింగ్‌లోకి వచ్చానని చెప్తారాయన. 1988 నుంచి ఇప్పటి వరకు కృష్ణానదిని తొమ్మిది సార్లు ఈదారు. డాక్టర్లు, వైద్యం, మాత్రల అవసరం లేకుండా జీవితం గడపాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నానంటారు. ఆక్వాక్లబ్‌లో రోజూ ఉదయం కొద్దిసేపు జిమ్ చేస్తారు.

అనంతరం గంటసేపు ఈతకొడతానంటారాయన. ఆయన భార్య విజయలక్ష్మి (85) కూడా గత సంవత్సరం విజయవాడలో కృష్ణా నదిని ఈదారు 84 సంవత్సరాల వయసులో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ముందుగా చాలా భయం వేసిందని చెబుతుంటారు. తర్వాత తన భర్తతో పాటు చాలామంది ప్రోత్సహించారని, నాలుగు నెలల్లోనే నేర్చుకుని గత ఏడాది కృష్ణా నదిని ఈదానని అంటున్నారు. ఈ పోటీలో తన భర్త జనార్దనమూర్తి , తాను కలిసి పాల్గొన్నారు. పోటీల కోసం కాకున్నా ఆరోగ్యం కోసమైనా ఈతను కొనసాగిస్తానంటున్నారు విజయలక్ష్మి. ఈవిడ అంతకు ముందు వాకింగ్, రన్నింగ్ చేసేవారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించారు.
70 ఏళ్ల వయసు - సైకిల్‌పై రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాడు!
సముద్రంలో 2 కి.మీ. ఈదా : 'మాది విజయవాడలోని ముత్యాలంపాడు. నాకు 88 సంవత్సరాలు. 1984లో నడుం నొప్పితో బాధపడేవాడిని. ఈతతో ఉపశమనం ఉంటుందని ఓ వైద్యుడు సలహా ఇచ్చారు. దీంతో కృష్ణా నదిలో ఈత నేర్చుకున్నా. కొన్ని రోజులకు నడుం నొప్పి తగ్గింది. కానీ ఈత కొట్టడం మాత్రం అలవాటుగా మారింది. కృష్ణా నదిని మూడుసార్లు, గోదావరిని ఓసారి ఈదేశాను. కాశీలోని గంగా నదిలో కూడా కి.మీ పైగా స్విమ్ చేశా. ఓసారి బాపట్ల దగ్గర్లోని సముద్రంలోనూ 2 కి.మీ వరకు వెళ్లాను. ఇప్పటికీ రోజూ ఉదయం గంటపాటు కృష్ణా నదిలో ఈతకొడుతున్నా.' -వేంకటేశ్వరరాజు
ఓ వైపు బాధ - మరోవైపు పోటీ - 86 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్న బామ్మ