Hydra On Lake View Apartments In Hyderabad : ఒకప్పుడు లేక్ వ్యూ అపార్ట్‌మెంట్లకు నగరంలో భలే గిరాకీ ఉండేది. చెరువు పక్కన కొత్త ప్రాజెక్టులు కడితే చాలు కొనుగోలుదారులు వరుస కట్టేవారు. డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడం కోసం నిర్మాణ సంస్థలు కూడా లేక్ వ్యూ పేరుతో ప్రాజెక్టును ప్రచారం చేసుకునేవి. ఇప్పుడు హైడ్రా రావడం వల్ల పరిస్థితి మారింది. జలవనరుల ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆలోచిస్తున్నారు.
హైడ్రా విచారణ : జలవనరుల వద్ద నిర్మిస్తోన్న అపార్ట్‌మెంట్లు, భారీ ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉందా అనే విషయమై హైడ్రా విచారణ ప్రారంభించింది. జాబితాలో సాధారణ ప్రాజెక్టులతో పాటు బడా నిర్మాణ సంస్థలకు చెందిన ‘లేక్ వ్యూ’ ప్రాజెక్టులు ఉన్నాయి. రెండు నుంచి మూడు వేలకు పైగా ఫ్లాట్లతో కడుతున్న భారీ ప్రాజెక్టులపై జరుగుతున్న విచారణ త్వరలో పూర్తవుతుందని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
హైడ్రా చెరువుల మ్యాప్ : హైడ్రా కొన్ని ప్రాజెక్ట్ సంస్థలు తాము చెరువును ఆక్రమించలేదనే వాదన వినిపిస్తుండగా ఏళ్ల నాటి చెరువుల మ్యాప్‌ను హైడ్రా వారికి చూపెడుతోంది. త్వరలోనే ఆయా భవన సముదాయాల కూల్చివేత ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. హైడ్రా సైతం భారీ భవనాలను ఎలా కూల్చాలనే విషయమై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.
కమిషనర్ రంగనాథ్ ముక్కుసూటి వైఖరితో హైడ్రాపై సామాన్యుల్లో విశ్వాసం పెరిగింది. జలవనరుల పక్కనే ఉన్న ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఆక్రమణ జరిగిందా? లేదా? అని పక్కాగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలని జనం అభిప్రాయపడుతున్నారు. ఆయా నిర్మాణ సంస్థలు సైతం లేక్ వ్యూ పదాన్ని కొన్ని నెలలపాటు పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నాయి.
హైడ్రాకు ఫిర్యాదులు : చార్మినార్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి చార్మినార్ జోన్లలోని పలు చెరువుల వద్ద నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఇటీవల కొంత మంది హైడ్రాకు ఫిర్యాదులు ఇచ్చారు. ప్రభుత్వ భూములను, చెరువును కలిపేసుకుని నిర్మాణ అనుమతి పొందారంటూ ఫిర్యాదుదారులు కొన్ని ఆధారాలను సమర్పించడంతో హైడ్రా విచారణ చేపట్టింది. నిర్మాణ అనుమతికి సమర్పించిన పత్రాలను పరిశీలిస్తూనే ఏళ్ల నాటి చెరువు మ్యాప్‌లను పరిశీలిస్తోంది.
విచారణలు పూర్తయ్యాక, కూల్చివేతలు ప్రారంభం : ఈ క్రమంలో ఆయా సంస్థలు చట్ట పరిధిలో తప్పించుకునేందుకు రకరకాల అనుమతులు, ఎన్వోసీలను చూపుతున్నాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. వాటికి తాము ప్రాధాన్యం ఇవ్వమని, ప్రాజెక్టును చెరువులో నిర్మిస్తున్నారా? వెలుపల కడుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనడమే ముఖ్యమంటున్నారు. ఆ విషయంపై స్పందించేందుకు నిర్మాణ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. పలు సంస్థలు చెరువు స్థలాన్ని ప్రాజెక్ట్‌లు నిర్మించి పిల్లలు ఆడుకునే ప్రాంతంగా, పార్కుగా చూపినట్లు ఇప్పటికే హైడ్రా విచారణలో తేలింది. మిగిలిన విచారణలు పూర్తయ్యాక, కూల్చివేతలను ప్రారంభిస్తామని హైడ్రా వెల్లడించింది.
సామాన్యుల్లోనూ 'హై'డ్రా గుబులు - నివాసాల కూల్చివేతలపై ఆందోళనలు - Hyderabad FTL And Buffer Zones