HYDRA Focus on Land Encroachments in Hyderabad : వాళ్లు తలుచుకుంటే ఏమైనా హాంఫట్ చేసేస్తారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు ఇలా ఏవైనా సరే మాయం చేయగల తెగువ వారిలో ఉంది. కానీ ఇప్పుడు తీరిగ్గా లెక్కలు చూస్తుంటే, పెద్ద సంఖ్యలో చెరువుల జాడ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై, నిబంధనలకు నీళ్లొదిలి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారిపై అవినీతి నిరోధక శాఖ(ACB) దృష్టి సారించింది. అయితే ఇప్పటికే వారిపై కేసు నమోదైతే వారితో పాటు కబ్జాలకు అధికారిక అనుమతులు ఇచ్చిన వారందరి అక్రమార్జన బాగోతాలను వెలికి తీయనుంది.
విశ్వసనీయ సమాచారాల ప్రకారం, ఏసీబీ ఇప్పటికే వీరందరి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత పదేళ్లలో జరిగిన ఆక్రమణలకు సంబంధించి ఉపగ్రహ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వివరాలను రాబట్టింది.
ఉపగ్రహ సమాచారంతో ఆక్రమణలు గుర్తింపు : ఉపగ్రహ సమాచారం ప్రకారం ఓఆర్ఆర్ లోపల పదేళ్లలో 44 నీటి వనరులు పూర్తిగా, 127 పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కారకులైన రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర శాఖల సహకారంతో హైడ్రా సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమై పూర్తి సమాచారాన్ని సేకరించింది. ఈ సేకరణలో అడ్డగోలుగా అధికారులు అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాల మేరకు మొత్తం ఆరుగురు అధికారులపై పోలీస్ స్టేషన్లలో హైడ్రా ఫిర్యాదు చేసింది.
చందానగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎం.రాజ్‌కుమార్, చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ ఎన్.సుధామ, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్‌సింగ్, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి సుధీర్‌కుమార్, మేడ్చల్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కె.శ్రీనివాసులుపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో వీరిపై దర్యాప్తు జరుగుతోంది. హైడ్రా పరిశీలనలో ఇప్పటివరకు కూలగొట్టిన అక్రమ కట్టడాల మొత్తం విస్తీర్ణం 114 ఎకరాలుగా ఉంది.
రెవెన్యూ, నీటిపారుదల, నగరపాలక, హెచ్ఎండీఏ వంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులైన కొందరు అధికారులు ఉన్నారు. అలాగే అధికారులతో పాటు సిబ్బంది కూడా ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలకు సహకరించినట్లుగా హైడ్రా గుర్తించింది. ఇదంతా వందల కోట్ల బిజినెస్‌గా తేల్చింది. ఈ వ్యవహారంపై, సిబ్బంది అక్రమార్జనపై ఏసీబీతో విచారణ చేయించనున్నారని తెలుస్తోంది. ఉద్యోగ విరమణ చేసిన వారిపైనా చర్యలకు హైడ్రా వెనకాడటం లేదు.
చెరువులు కుంటలు మాయం చేయడంలో కీలక పాత్ర : చెరువులు, కుంటలను మాయం చేయడంలో కొందరు అధికారులు కీలక పాత్ర పోషించారు. అయితే వారు ఉద్యోగ విరమణ చేసినా, వారి అక్రమార్జన కూడా వెలికి తీయాలని ప్రభుత్వం భావిస్తోంది. కబ్జాల్లో ముఖ్యపాత్ర పోషించిన ఓ అధికారి వల్ల సగం చెరువులు, కుంటలు మాయమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీలోకి మారిన అప్పటి ప్రముఖ ప్రజాప్రతినిధి ఒకరు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో కబ్జా అయిన ఆస్తులు, నిర్మించిన కట్టడాలు, వాటి యజమానులతో సదరు అధికారితో పాటు ప్రజాప్రతినిధికి ఉన్న సంబంధాలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
హైడ్రా నుంచి అద్దిరిపోయే న్యూస్! - కూల్చివేత బాధితులకు డబ్బులు - అలా చేస్తారట!
హైదరాబాద్ చెరువులకు మహర్దశ! - మంచినీటి జల వనరులుగా తీర్చిదిద్దనున్న హైడ్రా