Hydra Registered Cases Against Officers : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణరావు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్‌సింగ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్, సర్వే రికార్డ్స్ సహాయ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్‌ఎండీఏ సహాయ ప్రణాళికాధికారి సుధీర్‌కుమార్‌పై కేసు నమోదైంది.
ఈర్ల చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చినందుకు చందానగర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సుధాంశ్, జీహెచ్‌ఎంసీ సహాయ పట్టణ ప్రణాళికాధికారి రాజ్‌కుమార్ తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు అధికారులపై చర్యలు చేపట్టాలని రెండు రోజుల క్రితం హైడ్రా చేసిన సిఫారసుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
అధికారులపై కేసులు నమోదు : చందానగర్ మదీనాగూడ గ్రామంలోని ఈర్ల చెరువు బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించి ఈనెల 10, 11 తేదీల్లో భవనాలను కూల్చేసింది.ఈ నిర్మాణాలకు నాటి చందానగర్ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ సుధాంశు అనుమతులిచ్చారు. పలుమార్లు అక్రమ నిర్మాణాలు ఆపేయాలని నీటిపారుదల శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు హైడ్రా గుర్తించింది.
దీనివల్ల పర్యావరణానికి హాని జరిగిందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేశారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్‌లో 3 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రకుంట ఉంది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు అనుమతితో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3 భవనాలు నిర్మించారు. తప్పుడు సర్వే నంబర్లు వేయడంలో ఆక్రమణదారులకు బాచుపల్లి తహసీల్దార్ పూల్‌సింగ్ సహకరించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ సహాయ డైరెక్టర్ కె.శ్రీనివాసులు, హెచ్‌ఎండీఏ సహాయ ప్రణాళిక అధికారి సుధీర్‌కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఇదేతరహాలో అక్రమార్కులకు సహకరించిన మరికొంతమంది అధికారులపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది.