HYDRA Team Demolished Illegal Structures in Gandipet : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ జరిపి ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఇప్పుడు ఈ హైడ్రా టీంను చూస్తే రియల్టర్స్, అక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా గండిపేట చెరువులోని అనుమతులు లేని నిర్మాణాలను హైడ్రా టీం కూల్చివేసింది. చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్(FTL) పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక ప్రజలు హైడ్రా విభాగానికి ఫిర్యాదు చేశారు.
దీంతో కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లుగా తేల్చారు. దీంతో వారు కార్యాచరణ చేపట్టారు. 20కి పైగా బహుళ అంతస్తుల భవనాలను స్థానిక మున్సిపల్, రెవెన్యూ, వాటర్ బోర్డు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేశారు.
పాత తేదీల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు : 2009లో స్థానిక గ్రామ పంచాయితీకి చెందిన మహిళా సర్పంచ్ గతంలో గ్రామ పంచాయితీ పేరుతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. అయితే సదరు సర్పంచ్ ఇప్పటికీ పాత తేదీలతో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. ఇది చట్ట విరుద్ధమని, పాత తేదీల్లో అనుమతులను జారీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు.
అదే విధంగా ప్రస్తుతం నిర్మాణం కోసం పాత తేదీలపై జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని తేల్చి చెప్పారు. ప్రస్తుత మున్సిపల్ నిబంధనలు అనుసరించి భవన నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ అధికారులు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. గతంలో సర్పంచ్ జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని ప్రజలు గుర్తించాలని అధికారులు సూచించారు.
బఫర్ జోన్లలలో స్థిరాస్తి కొనుగోళ్లు వద్దు : నగర ప్రజలకు మంచినీటిని అందిస్తున్న గండిపేట చెరువులో అక్రమ నిర్మాణాలకు పాల్పడం ద్వారా వాటిని నుంచే వచ్చే వ్యర్ధాలు చెరువులోకి చేరి మంచినీరు కలుషితం అవుతున్నాయి. తప్పుడు పత్రాలు, కాలం తీరిన అనుమతులతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేయవద్దని, ఆయా ప్రాంతాలలో స్థిరాస్తులు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజలకు సూచించారు.