Ranganath about Hydra 100 Days : ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లకు హైడ్రా మరోసారి హెచ్చరిక జారీ చేసింది. సర్వే నంబర్లు మార్చి తప్పుడు సమాచారంతో అనుమతులు తీసుకొని భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా చర్యలు తప్పకుండా ఉంటాయని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అలాగే హైడ్రా కూల్చివేతల తర్వాత ఆ వ్యర్థాలను సదరు బిల్డరే తొలగించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని సూచించారు. ఇప్పటికే ఈ విషయంలో పలువురు బిల్డర్లు, యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కొంతమంది నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తుండగా మరికొంత మంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
హైడ్రా ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన రంగనాథ్, ప్రభుత్వ లక్ష్యం మేరకు హైడ్రా ముందుకు సాగుతుందన్నారు. చెరువులకు పునరుజ్జీవనం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్రయత్నాల్లో దానిపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదని రంగనాథ్ పునరుద్ఘాటించారు. అలాగే భవన నిర్మాణాల వ్యర్థాల తొలగింపు ప్రక్రియను పూర్తిగా టెండర్ల ద్వారానే పిలిచి అప్పగించామని, ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్లోని వ్యర్థాల్లో ఇనుప చువ్వుల తరలింపుపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఖండించారు. నగరంలో ట్రాఫిక్, వరద నీటి సమస్య పరిష్కారానికి కూడా హైడ్రా చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.
చెట్లు పరిరక్షణతోపాటు రహదారులపై దృష్టి : మరోవైపు నగరంలోని దాదాపు 100 చెరువుల్లో ఆక్రమణలు తొలగించి, సుందరీకరణ చేసి పర్యాటక ప్రదేశాలుగా మార్చాలని హైడ్రా నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని చెరువులను సీఎస్‌ఆర్ పథకం కింద, మరికొన్నిహెచ్‌ఎండీఏ సొంత నిధులతో పర్యాటక ప్రదేశాలుగా చేయనున్నారు. ఆక్రమణలు తొలగించడమే కాకుండా సుందరీకరణ చేస్తే ప్రయోజనాలు ఉంటాయని యోచిస్తున్నారు. చెరువుల సుందరీకరణకు సంబంధించిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌కు ఇచ్చారు.
పూడికతీతతో పాటు చుట్టూ పచ్చదనం పెంచి పర్యాటక ప్రాంతాలుగా మార్చేలా ప్రణాళికలు రూపొందించారు. బెంగళూరు తరహాలో చెరువులకు పునరుజ్జీవం పోయాలని అధికారులు యోచిస్తున్నారు. చెట్ల పరిరక్షణతో పాటు ప్రధాన రహదారులు, కాలనీల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను సైతం వెంటనే తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని, ఇంకా ఇబ్బందిగా ఉంటే ఆ చెట్లను ట్రాన్స్ లొకేట్ చేయాలని రంగనాథ్ నిర్ణయించారు.
దుర్గం చెరువు ఒక్కటే కాదు - హైదరాబాద్ వాసులకు ఇకపై '100' ఆప్షన్స్!
ఈసారి చెట్లపై 'హైడ్రా' ఫోకస్ - ఇక హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ సమస్యకు చెక్?