Commissioner Ranganath Clarity On Owaisi College : రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదల్చుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్‌ను రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు.
హైడ్రా కమిషనర్‌ను కలిసిన బీజేపీ కార్పోరేటర్లు : జీహెచ్ఎంసీలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు బుద్దభవన్లో ఉన్న హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌ను కలిసి చెరువులు, పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. ఓవైసీ, మల్లారెడ్డి సహా పలు ఆక్రమణలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లతో మాట్లాడిన రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదని కూల్చడమేనని అన్నారు. పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలుంటాయని కార్పొరేటర్లకు వివరించారు.
చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు : హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుద్దభవన్‌లోని హైడ్రా కార్యాలయాలనికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వరుస కడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. మొదట పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు హైడ్రా కఠిన చర్యలతో వందల్లో పెరుగుతున్నాయి. వాటన్నింటిని స్వీకరిస్తున్న హైడ్రా కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు.
"ఒవైసీ, మల్లారెడ్డి అని చూడం, విద్యార్థుల భవిష్యత్తు ఆలోచిస్తాం. చెరువులు ఆక్రమించి కళాశాలలు కట్టడం వాళ్ల తప్పై ఉండొచ్చు. ఎఫ్‌టీఎల్ ప్రధాన అంశమే అయినా విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఒవైసీ, మల్లారెడ్డి కళాశాలలకు సమయం ఇస్తాం. పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి. ధర్మ సత్రమైనా ఎఫ్‌టీఎల్‌లో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు, కూల్చడమే." -రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు : చెరువులు, కుంటలను ఆక్రమించుకుని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా వాటిని కూల్చివేసే పనిని చేపట్టింది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు తదితరుల కట్టడాలు కూల్చివేసినట్లు నివేదికలో వెల్లడించారు. ప్రధానంగా ఫిల్మ్ నగర్, లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, అమీర్‌పేట్‌లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు వివరించారు.
'హైడ్రాకు జై' కొడుతున్న జనం - మాకూ కావాలంటున్న జిల్లాలు - WE WANT HYDRA IN OUR DISTRICTS