Ranganath Clarity on Musi Demolitions : హైదరాబాద్‌లో ప్రభుత్వస్థలాలు, చెరువుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కూల్చివేతల వ్యవహారంలో గతంలో ఇచ్చిన తీర్పుల ఉల్లంఘన జరిగిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో హైడ్రా పనితీరును వివరిస్తూ కమిషనర్ రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు.
కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా పనిచేయట్లేదని చెరువుల పునరుద్దరణకి పాటుపడుతుందని రంగనాథ్ స్పష్టంచేశారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చడం లేదన్న ఆయన ఆ విషయాన్ని ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఔటర్ రింగు రోడ్డు వరకే హైడ్రా పరిధి ఉందన్న రంగనాథ్, నగరంలోనే కాదు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలని హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వివరించారు.
పేదల నివాసాల జోలికివెళ్లం : పేదల నివాసాల జోలికెళ్లమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. ప్రకృతివనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలు కాపాడడం వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలుచేపట్టడం, వరదనీరు సాఫీగా వెళ్లేలా హైడ్రా పనిచేస్తోందని రంగనాథ్ వివరించారు. వాతావరణశాఖ హెచ్చరికలను అనుసరిస్తూ డీఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికప్పుడు రంగంలోకి దించుతున్నామన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడటం కాకుండా చెట్లుకూలితే వెంటనే తొలగించడం, రహదారులు, నివాసాల్లోకి వచ్చే వరద నీటిని మళ్లించడం, వరద ముప్పు లేకుండా వరద నీటి కాలువలు సాఫీగా పారేలా చూడటం జరుగుతుందన్నారు. డీఆర్ఎఫ్ బృందాలతో నష్ట నివారణ చర్యలు, ప్రజలకు రక్షణ కల్పించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు.
చెరువులను పునరుద్దరిస్తాం : ఒకప్పడు నగరానికి లేక్ సిటీగా పేరుండేదని గొలుసుకట్టు చెరువులు సాగు, తాగు నీరందించేవని రంగనాథ్ గుర్తుచేశారు. ఆ చెరువులను పునరుద్దరించడం, వరద నీరు ఆయా చెరువుల్లోకి ఎక్కడికక్కడ చేరేలా చూడటం జరుగుతోందని చెప్పారు. అందుకోసం వరదనీటి కాల్వలు. నాలాలు ఆక్రమణలు లేకుండా నీరుసాఫీగా సాగేలా చర్యలు చేపడుతున్నట్లు రంగనాథ్ తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్, స్టేట్ రిమోట్ సెన్సింగ్ విభాగాలతో అధ్యయనం చేయించి చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు.
హైడ్రాపై అవాస్తవాల ప్రచారం : మూసీ సుందరీకరణ విషయంలో హైడ్రాపై అవాస్తవాలు ప్రచారమవుతున్నాయన్న రంగనాథ్, మూసీకి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని, నిర్వాసితులను హైడ్రా తరలించడం లేదని స్పష్టంచేశారు మూసీ నదిలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయట్లేదని వివరించారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని తెలిపిన రంగనాథ్, అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని వెల్లడించారు.
ట్రాఫిక్ విషయాన్ని హైకోర్టు ప్రస్తావించిన క్రమంలో రంగనాథ్ వివరణ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై హైడ్రా కసరత్తు చేస్తుందన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ప్రాంతాల గుర్తింపు, నివారణకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణానికి చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపిన రంగనాథ్ కాలుష్యం పెరుగుదలపైనా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.
సుప్రీంకోర్టు 'బుల్డోజర్ న్యాయం ఆపండి' ఆదేశాలు 'హైడ్రా'కు వర్తించవ్ : రంగనాథ్ - HYDRA Ranganath on SC Verdict
పేదలను ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా అభిమతం కాదు : రంగనాథ్ - HYDRA RANGANATH COMMENTS