Hyderabad Water Board Key Decision on Water Pending Bills: మొండి బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతుండడంతో.. హైదరాబాద్ జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా పెండింగ్ బిల్లులు పక్కాగా వసూలు చేయాలని నిర్ణయించి.. బకాయిదారులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే భారీగా బకాయి పడిన ఇంటి ఓనర్ల లిస్టును కూడా జలమండలి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వసూళ్లలో భాగంగా ముందుగా ఇంటి ఓనర్లకు నోటీసులు అందించనున్నారు. నోటీలు ఇచ్చినా చెల్లించడానికి ముందుకు రాకపోతే ఇంటి నల్లాల కనెక్షన్లను తొలగించనున్నట్టు సమాచారం. ఈ మేరకు జలమండలి ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
స్పెషల్ డ్రైవ్..
10 వేల రూపాయల కంటే ఎక్కువ మెుండి బకాయిలు దాటిన గృహ, వాణిజ్య నల్లాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. వీటితోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు సైతం జలమండలి నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా సంస్థల బకాయిలు కూడా భారీగా పెరిగిపోయాయి. జల మండలి అధికారుల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం మెుత్తం బకాయిలు రూ.15వందల కోట్లు దాటాయట. ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయా శాఖ హెచ్‌ఓడీ (HOD)లకు జలమండలి అధికారులు లేఖలు రాయనున్నట్టు సమాచారం.
నిర్వహణ వ్యయం అధికం..
నీటి బిల్లులు, కొత్త నల్లాల ద్వారా జలమండలికి ప్రతి నెలా రూ.115 - రూ.130 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. కానీ.. ఖర్చు అంతకు మించి ఉంటున్నట్టు సమాచారం. ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లుల కింద ఖర్చు దాదాపు రూ.160 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందట. ఈ నేపథ్యంలో నీటి బిల్లుల మొండి బకాయిలపై సీరియస్‌గా దృష్టి సారించాలని నిర్ణయించిన అధికారులు.. కఠిన చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం.
ఆన్లైన్లో నీటి బిల్లులు చెల్లించండిలా..
- ముందుగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అధికారిక వెబ్‌సైట్ https://www.hyderabadwater.gov.in/ లోనికి వెళ్లండి.
- హోమ్‌పేజీలో Services(సేవలు) ట్యాబ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. కస్టమర్ సర్వీసెస్ ఆప్షన్(వినియోగదారుల సేవలు)లో.. Pay Your Bill Online(ఆన్లైన్ బిల్లు చెల్లింపు)పై క్లిక్ చేయండి.
- తదుపరి పేజీలో.. చెల్లించడానికి తగిన లింక్‌ను (Bill Desk లేదా Official Govt Wallet)క్లిక్ చేయండి.
- మీరు అధికారిక ప్రభుత్వ వాలెట్‌ని ఎంచుకుంటే.. HMWSSB వాటర్ బిల్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీరు CAN నంబర్‌ను నమోదు చేసి, “Request for Bill ఆప్షన్‌పై”క్లిక్ చేయాలి.
- అనంతరం స్క్రీన్‌పై నీటి బిల్లు వివరాలు కనిపిస్తాయి.. వాటిని తనిఖీ చేసి చెల్లింపు చేయండి.
- చెల్లింపును పూర్తి చేసిన తర్వాత, రసీదును ప్రింటవుట్ తీసుకోండి.
బిల్ డెస్క్ ద్వారా చెల్లింపులు..
- ఒకవేళ మీరు బిల్ డెస్క్‌ను ఎంచుకుంటే.. HMWSSB వాటర్ బిల్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీరు CAN నంబర్‌ను నమోదు చేసి, “Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం స్క్రీన్‌పై నీటి బిల్లు వివరాలు కనిపిస్తాయి.. వాటిని తనిఖీ చేసి చెల్లింపు చేయండి.
- చెల్లింపును పూర్తి చేసిన తర్వాత, రసీదును ప్రింట్ అవుట్ తీసుకోండి.
How to Pay HMWSSB Water Bill in Hyderabad by Online : ఆన్లైన్లో వాటర్ బిల్.. ఈజీగా చెల్లించండి!