Hyderabad Thyagaraja Aradhana Music Festival : హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన మ్యూజిక్ ఫెస్టివల్ (హెచ్‌టీఏఎంఎఫ్-2024) 9వ ఎడిషన్ ఘనంగా జరిగింది. జంట నగరాల్లో ఉన్న కర్ణాటక సంగీత కళాకారుల గళార్చన శ్రోతలను ఆకట్టుకుంది. శిల్పారామంలోని ఎత్నిక్ హాల్‌లో ఇవాళ ఉదయం 500 మందికి పైగా సంగీత విద్వాంసులు కలిసి త్యాగరాజ స్వామి రచించిన ఘన రాగ పంచరత్న కృతులను, గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం, ఘటం, మోర్సింగ్ వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసులను రంజింప చేశారు.
Woman Teaching Telugu in America : మాతృభాషపై మమకారం.. అమెరికాలో తెలుగు నేర్పిస్తున్న మాధవీలత
HTAMF 2024 : హృదయాలను రంజింపజేసే విధంగా మరువలేని మధురానుభూతిని అందించారు. పంచరత్న సేవకు ముందుగా వేకువజామున సంగీత విద్యార్థులు, పిల్లలు, పెద్దలు త్యాగరాజ కీర్తనలను ఆలపిస్తూ, నగర సంకీర్తన చేస్తూ, ఉంచవృత్తి సంప్రదాయంలో సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారి విగ్రహాలను ఊరేగించారు. పంచరత్న గోష్టి గానము జరుగుతుండగా, పురోహితులు ఉత్సవ విగ్రహాలకు, త్యాగరాజ స్వామికి అభిషేకం చేశారు.
పంచరత్న సేవ ప్రారంభించే ముందు సంస్కృతి ఫౌండేషన్ సభ్యులు, ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువు, స్వరకర్త - కళారత్న విద్వాన్ మోదుమూడి సుధాకర్ గురు సత్కారం చేశారు. సీనియర్ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాన్ డాక్టర్ యెల్లా వెంకటేశ్వరరావు తదితరులు ఆయనకు సన్మానించారు. కర్ణాటక సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, అనేక మంది కళాకారులకు శిక్షణ ఇవ్వడంలో ఆయన చేసిన అపారమైన కృషిని అభినందిస్తూ కొనియాడారు.
హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవం ముగింపు సాయంత్రం యాంఫి థియేటర్‌లో ఘనంగా జరిగింది. గురుకులం విద్యార్థులచే, వయోలిన్, గాత్ర కచేరీతో వీనులవిందుగా కార్యక్రమం కొనసాగింది. విద్వాన్ కళారత్న మోదుమూడి సుధాకర్ (హెచ్.టీ.ఏ.ఎం.ఎఫ్- 2024) ఆఖరి కచేరీని ఆయన గాత్రంతో భక్తి పారవశ్యంలో ఓలలాడించారు. సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసి త్యాగరాజ స్వామికి గళార్చన చేశారు. సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంగీత కచేరీలో వయోలిన్ తో విదుషి వీఎస్‌పీ గాయత్రి శివాని, మృదంగంతో విద్వాన్ పారుపల్లి ఫాల్గుణ్, ఆరంగి శ్రీనివాస రావు, విద్వాన్ ఎస్.ఏ ఫణి భూషణ్ ఘటంతో వాద్య సహకారాన్ని అందించారు. 9వ ఎడిషన్ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవం సంగీత అభిమానులకు అద్భుతమైన అనుభూతిని కలిగించింది.