Hyderabad Student Attack in US : అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన సయ్యద్ మజాహిర్ అలీ అనే హైదరాబాద్ విద్యార్థిపై అక్కడ దాడి జరిగిన విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితమే లంగర్‌హౌజ్ హషీమ్‌నగర్‌కు చెందిన మజాహిర్ అలీ అమెరికా వెళ్లి అక్కడి ఇండియానా వెస్లయన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. మంగళవారం రోజు రాత్రి అతడు హోటల్ నుంచి ఇంటికెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి తల, ముక్కు, కళ్లపై గాయాలయ్యాయి. రక్తంతో తడిసిన అతడు అలాగే తనపై జరిగిన దాడి గురించి ఓ వీడియో రికార్డు చేశాడు. దానికి సీసీటీవీ ఫుటేజీ కూడా జత చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని, అమెరికా ఎంబసీని కోరాడు.
Indian Student Attack in US : ఈ విషయం తెలుసుకున్న సయ్యద్ అలీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడి పరిస్థితి ఎలా ఉందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సయ్యద్ భార్య ఫాతిమా రిజ్వి తన భర్తకు సాయం చేయాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ .జై శంకర్‌కు లేఖ రాశారు. తన భర్తపై దాడి జరిగిందని అతడి స్నేహితుడొకరు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ప్రస్తుతం సయ్యద్ భద్రతపై ఆందోళనగా ఉందని వాపోయారు. దయచేసి తన భర్తకు సరైన చికిత్స అందేలా చూడాలని, వీలైతే తానూ అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని ఆమె లేఖలో జైశంకర్‌ను కోరారు.
అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దాడి - సెల్‌ఫోన్, డబ్బులు లాక్కొని పరారైన దుండగులు
మరోవైపు సయ్యద్‌పై దాడి ఘటనపై అమెరికా చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. 'బాధిత విద్యార్థి మజాహిర్ అలీ, ఆయన భార్యతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అవసరమైన సాయం అందిస్తాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించాం.' అని భారత కాన్సులేట్ హామీ ఇచ్చింది.
అండగా మేమున్నాం : అమెరికాలో తెలుగు విద్యార్థులపై దాడులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు విద్యార్థులపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతపై తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఉన్నత చదువుల కోసమో లేక ఉద్యోగం కోసమో కన్నవాళ్లను, పుట్టిన ఊరును, తోబుట్టువులను, జీవితభాగస్వాములను వదిలి కెరీర్ కోసం, కుటుంబం కోసం ఎంతో మంది ప్రతిరోజు దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరూ తెలియని కొత్త ప్రదేశంలో వచ్చీ రాని భాషతో ఒక పూట తింటూ మరోపూట పస్తులుంటూ కొందరు చదువుకుంటుంటే మరికొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
అయితే ఇలా జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో పుట్టినగడ్డను వదిలి విదేశాలకు వెళ్లిన చాలా మందిపై అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో కొంతమంది అక్కడే ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు తీవ్ర గాయాలపాలవుతున్నారు. చివరకు ఏ ఆశయంతో విదేశాలకు వెళ్తున్నారో అది నెరవేరక ముందే కొంత మంది గాయాలతో స్వదేశానికి తిరిగి వస్తుంటే మరికొందరు నిర్జీవంగా శవపేటికల్లో భారతగడ్డపై అడుగుపెడుతున్నారు.
అమెరికాలో మళ్లీ హింస- కాల్పుల్లో 8మంది మృతి- నిందితుడి ఆత్మహత్య