Hyderabad Street Food Kumari Aunty Story : ఐటీ కారిడార్‌లో తోపుడు బండి పెట్టుకొని భోజనాలు విక్రయిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందిన కుమారి కథ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో సుఖాంతమైనా, ఈ ఉదంతం పలు ప్రశ్నలకు తావిస్తుంది. ముఖ్యంగా నగర ఆర్థికాభివృద్ధిలో వీధి వ్యాపారుల పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 1.65 లక్షల మంది వీధి వ్యాపారులను అధికారులు గుర్తించారు. ఇందులో 1.35 లక్షల మందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. వీరిలో చాలామందికి పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి కింద లోన్స్ ఇచ్చారు. ఈ రుణాలు ఇవ్వడంలో హైదరాబాద్ ముందుంది.
మరోవైపు వీధి వ్యాపారుల కారణంగా వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇటీవల కుమారి అంటీ మెస్ వద్దకు వాహనదారులు పోటెత్తడంతో అక్కడ ట్రాఫిక్ జాం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని అక్కడ నుంచి పంపించి వేశారు. సామాజిక మాధ్యమాల్లో మళ్లీ ఈ విషయంపై చర్చ జరగంతో సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకుని మళ్లీ ఆ ప్రదేశంలోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం తెలిసిందే.
నరకం చూస్తున్న వీధి వ్యాపారులు.. పడిపోయిన అమ్మకాలు
నగరంలో సంచార విక్రయశాలలతో చాలామంది జీవనోపాధి పొందుతున్నారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు భద్రత, రక్షణ, వారి వ్యాపారానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.
Street Business in Greater Hyderabad : గ్రేటర్ వ్యాప్తంగా వీధి వ్యాపారుల కోసం కమర్షియల్ జోన్లను గుర్తించారు. ఐటీ కారిడార్‌తో పాటు కూకట్పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, అబిడ్స్, మెహదీపట్నం, ఎల్బీనగర్, నాంపల్లి ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వీధి వ్యాపారాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా వీధి వ్యాపారుల కోసం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్నాళ్లకే తిరిగి రోడ్లును ఆక్రమించి విక్రయాలు జరుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.
రుణ మంజూరులో ఆలస్యం.. వీధి వ్యాపారుల పాలిట శాపం
నగరాన్ని మూడు జోన్ల కింద గుర్తించి అక్కడ ప్రత్యేత ఏర్పాట్లు చేస్తే, వీధి వ్యాపారాలు సజావుగా సాగుతాయని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా రహదారులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అసలు వ్యాపారానికి అనుమతించకపోవడం, తక్కవ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కొంతవరకు వ్యాపారులకు ప్రత్యేక జోన్లు కేటాయించడం, అంత ట్రాఫిక్ లేని చోట్ల పూర్తిస్థాయిలో వీధి వ్యాపారులకు అవకాశం కల్పించడంతో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయంటున్నారు.
'సుల్తాన్‌బజార్ వీధి వ్యాపారులను ఆదుకోవాలి'
వీధి వ్యాపారులతో పాటు పాదచారులు, వాహనదారుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. నగరంలో వీధి వ్యాపారులు కోసం ప్రత్యేక జోన్లు కల్పించినా, అక్కడకు వినియోగదారులు ఎవరూ రావడం లేదని కొందరు ఆ స్థలాలకు వెళ్లటం లేదు. స్థానిక నేతల జోక్యంతో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకుంటే తీరుతుంది. దిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో వీధి వ్యాపారాలకు ప్రత్యేక ప్రాంతాలే ఉన్నాయో అలాంటి ప్రత్యేక జోన్లు కేటాయించాలి.
'ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు వీధి వ్యాపారులు సహకరించాలి'