Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలైంది. ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిబోయింది. వ్యాపారం, ఉద్యోగం అంటూ వివిధ కారణాలతో పట్నంలో బతుకున్నతున్న వారంతా తిరిగి పల్లెబాట పట్టారు. దీంతో రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లక్డీకపూల్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రాత్రి-పగలూ తేడాలేకుండా రద్దీగా ఉండే నగర రహదారులు ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి.
వరుసగా 3 రోజులు సెలవులు, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో నగరవాసులు పెద్ద ఎత్తున సొంతూర్లకు బయలుదేరారు. హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్-వరంగల్ తదితర రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న వారితో పాటు సూర్యాపేట, ఖమ్మం వెళ్లే వారితో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దాదాపు 95 శాతం వాహనాలు ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవడంతో టోల్‌గేట్ నుంచి నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోతున్నాయి.
మరోవైపు ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటికే 590 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, మరో 140 సర్వీసులను హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ఆన్‌లైన్‌లో ముందుస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది.
ఓటర్లంతా సురక్షితంగా వెళ్లి, తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. రెండు రోజులుగా నగరంలో బస్టాండ్లలో కొనసాగుతున్న రద్దీ కాస్త తగ్గింది. ఈ ఉదయం ఎంజీబీఎస్‌లో తీవ్రమైన రద్దీ ఉండగా, సాయంత్రానికి అది కాస్త తగ్గింది. విజయవాడ, కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్‌తో పాటు కర్ణాటక వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌లలో కంటే ప్రభుత్వ బస్సుల్లోనే భద్రత ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓటేసేందుకు ఊరెళ్తున్న భాగ్యనగరం - ప్రయాణికులతో కిక్కిరిసిన ఎంజీబీఎస్ - HEAVY RUSH AT MGBS